పీవీ సింధు
కౌలాలంపూర్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22–20, 21–19తో రియో ఒలింపిక్స్ చాంపియన్, మాజీ విశ్వవిజేత కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించగా... శ్రీకాంత్ 21–18, 21–14తో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు; ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ ఆడతారు. ముఖా ముఖి రికార్డుల్లో సింధు 3–8తో, శ్రీకాంత్ 3–5తో వెనుకబడి ఉండటం గమనార్హం. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే ఎదురైంది. అయితే కీలకదశలో సింధు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండోగేమ్‌లో సింధు దూకుడుగా ఆడి ఆరంభంలోనే 11–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన్ పుంజుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–19 వద్ద సింధు క్రాస్ కోర్టు స్మాష్ సంధించి మారిన్ ఆట కట్టించింది.
నేటి సెమీఫైనల్స్
ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment