malaysia open badminton
-
Malaysia Open 2024: రన్నరప్ సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–9, 18–21, 17–21తో ఓడిపోయింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ 10–3తో ఏకంగా 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. కానీ ఒత్తిడికిలోనై, అనవసర తప్పిదాలు చేసి భారత జంట చైనా జోడీకి పుంజుకునే అవకాశం ఇచి్చంది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు 45,500 డాలర్ల (రూ. 37 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 16–21, 21–11, 15–21తో ప్రపంచ 17వ ర్యాంక్ ద్వయం లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8,400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ ద్వయం 17–21, 22–20, 21–9తో లియు యు చెన్–జువాన్ యి ఒయు (చైనా) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ 16–21, 21–19, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్‌కు 6,875 డాలర్ల (రూ. 5 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
స్పెయిన్ షట్లర్ చేతిలో పదో సారి ఓడిన పీవీ సింధు
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమితో ప్రారంభించింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. చిరకాల ప్రత్యర్థి, మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–10, 15–21తో ఓడిపోయింది. మారిన్, సింధు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖిగా తలపడగా... మారిన్ పదిసార్లు సింధును ఓడించి, ఐదుసార్లు ఆమె చేతిలో ఓడిపోయింది. 2018 మలేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చివరిసారి మారిన్‌పై సింధు గెలిచింది. చీలమండ గాయం కారణంగా ఐదు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో ఆడపాదడపా మెరిసింది. యాదృచ్ఛికంగా మూడు గేముల్లోనూ ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమంగా కాకపోవడం విశేషం. తొలి గేమ్‌లో మారిన్ పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో సింధు విజృంభించింది. మూడో గేమ్‌లో మళ్లీ మారిన్ పుంజుకుంది. ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన మారిన్ అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్ 9–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 22–24, 21–12, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్‌పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–13తో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (కొరియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
సింధు ముందుకు.. సైనా ఇంటికి
మలేషియా ఓపెన్ 2022లో భారత్‌కు ఇవాళ (జూన్ 29) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, ప్రపంచ 7వ ర్యాంకర్ పీవీ సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించగా.. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. వరల్డ్ నంబర్ 10 ప్లేయర్ పోన్‌పావీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై సింధు 21-13, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్ చేతిలో 11-21, 17-21 తేడాతో సైనా ఓటమిపాలైంది. మరోవైపు డబుల్స్ పెయిర్ బి సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప.. నెదర్లాండ్స్ జోడీ రాబిన్ టాబెలింగ్-సెలెనా పీక్ చేతిలో 15-21, 21-19 17-21 తేడాతో ఓటమిపాలవగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో విజయం సాధించాడు. ప్రణయ్.. స్థానిక ఆటగాడు ల్యూ డారెన్‌పై 21-14, 17-21, 21-18తేడాతో గెలుపొందాడు. చదవండి: 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
లిన్ డాన్ రెండేళ్ల తర్వాత...
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ దిగ్గజం, ఐదు సార్లు ప్రపంచ చాంపియన్, రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ 35 ఏళ్ల వయసులోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. గత రెండేళ్లుగా అనామక ఆటగాళ్ల చేతుల్లో వరుస పరాజయాలతో దాదాపు నిష్క్రమించినట్లుగా కనిపించిన అతను మరో పెద్ద విజయంతో సత్తా చాటాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ మలేసియా ఓపెన్‌లో డాన్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో డాన్ తన జూనియర్ చెన్ లాంగ్ (చైనా)పై 9–21, 21–7, 21–11 స్కోరుతో విజయం సాధించాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మలేసియా ఓపెన్ (అప్పట్లో సూపర్ సిరీస్ ప్రీమియర్)ను గెలుచుకున్న అనంతరం డాన్ మరో టైటిల్ సాధించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే టోర్నీతో అతను తన విలువను ప్రదర్శించాడు. డాన్ చిరకాల ప్రత్యర్థి, ప్రస్తుతం క్యాన్సర్‌నుంచి చికిత్స పొందుతూ ఆటకు దూరంగా ఉన్న లీ చోంగ్ వీ (మలేసియా) విజేతకు బహుమతి అందజేయడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (తైపీ) వరుసగా మూడో సారి గెలుచుకుంది. ఫైనల్లో తై జు 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)ను ఓడించింది. డబుల్స్ ఈవెంట్లన్నీ చైనా షట్లర్లే గెలుచుకున్నారు. పురుషుల డబుల్స్‌లో లి జున్ హు–లి యుచెన్ (చైనా), మహిళల డబుల్స్‌లో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ (చైనా), మిక్స్డ్ డబుల్స్‌లో జెంగ్ సివే– హువాంగ్ (చైనా) జోడీలు విజేతలుగా నిలిచాయి. -
సమీర్ నిష్క్రమణ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సమీర్ వర్మ పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. మంగళవారం పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా)తో తలపడిన సమీర్ పోరాడి ఓడాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 20–22, 23–21, 12–21తో చైనా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. 65 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో పరాజయం ఎదురైనప్పటికీ 24 ఏళ్ల సమీర్ అద్భుతంగా పోరాడాడు. తెలుగమ్మాయి, డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 22–20, 24–22తో సామ్ మ్యాగీ–క్లో మ్యాగీ (ఐర్లాండ్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో జతకట్టిన ఆమె 20–22, 21–17, 20–22తో బయెక్ హ న–కిమ్ హె రిన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ పీవీ సింధు... జపాన్‌కు చెందిన అయ ఒహొరితో, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్... థాయ్‌లాండ్ షట్లర్ పొర్న్‌పవి చొచువొంగ్‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్... ఇసాన్ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)తో, హెచ్.ఎస్. ప్రణయ్... సితికొమ్ తమసిన్ (థాయ్‌లాండ్)తో పోటీపడతారు. -
సైనా పోరు ముగిసె
కౌలాలంపూర్: కొత్త సీజన్లో ఆడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే ఫైనల్‌కు చేరాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 13–21తో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్ ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సైనాను గతంలో ఐదుసార్లు ఓడించిన మారిన్ వెంటనే కోలుకుంది. దూకుడుగా ఆడుతూ సైనాపై ఒత్తిడి పెంచుతూ వరుసగా ఏడు పాయింట్లు సాధించి 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన మారిన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మారిన్ మరింత విజృంభించగా... సైనా డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో మొదటి పాయింట్ సైనా సాధించినా... ఆ తర్వాత మారిన్ ఆరు పాయింట్లు గెలిచి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఇక వెనుదిరిగి చూడలేదు. సెమీస్‌లో ఓడిన సైనాకు 5,075 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 61 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు, శ్రీకాంత్‌లకు నిరాశ
కౌలాలంపూర్: గతేడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ సీజన్లో మరోసారి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్ వరల్డ్ టూర్–750 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం సెమీఫైనల్స్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు 15–21, 21–19, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 13–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. సింధు, శ్రీకాంత్‌లకు 9,800 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 71 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తై జు యింగ్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధుకు ఈసారీ అలాంటి ఫలితమే వచ్చింది. ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా కీలకదశలో సింధు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
కౌలాలంపూర్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22–20, 21–19తో రియో ఒలింపిక్స్ చాంపియన్, మాజీ విశ్వవిజేత కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించగా... శ్రీకాంత్ 21–18, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు; ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ ఆడతారు. ముఖా ముఖి రికార్డుల్లో సింధు 3–8తో, శ్రీకాంత్ 3–5తో వెనుకబడి ఉండటం గమనార్హం. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే ఎదురైంది. అయితే కీలకదశలో సింధు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండోగేమ్‌లో సింధు దూకుడుగా ఆడి ఆరంభంలోనే 11–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన్ పుంజుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–19 వద్ద సింధు క్రాస్ కోర్టు స్మాష్ సంధించి మారిన్ ఆట కట్టించింది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం. -
క్వార్టర్స్‌లో సైనా
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ శ్రీకాంత్‌కు నిరాశ కౌలాలంపూర్: ఇటీవల తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటున్న భారత బ్యాడ్మింటన్ మేటి క్రీడాకారిణి సైనా నెహ్వాల్... మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్‌లో మరో అడుగు ముందుకేయగా, పురుషుల విభాగంలో మాత్రం భారత కుర్రాళ్లు చతికిలపడ్డారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సైనా 21-13, 21-9తో క్వాలిఫయర్ జుయ్ యావో (చైనా)పై నెగ్గింది. దీంతో 2014లో జుయ్ చేతిలో తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కేవలం 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాద్ అమ్మాయి కచ్చితమైన షాట్లతో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలిగేమ్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఇద్దరు క్రీడాకారిణిలు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లారు. ఈ గేమ్ మొత్తంలో జుయ్ ఒకే ఒక్కసారి 11-12తో సైనాకు పోటీ ఇచ్చింది. కానీ నెట్ వద్ద మెరుగైన డ్రాప్ షాట్లతో చెలరేగిన హైదరాబాదీ వరుసగా నాలుగు, రెండు, మూడు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో జుయ్ పుంజుకోవడంతో స్కోరు 3-3తో సమమైంది. ఈ దశలో సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 7-3 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లారు. చివరకు స్కోరు 15-9 ఉన్న దశలో సైనా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో సైనా... ప్రపంచ 15వ ర్యాంకర్ సన్ యు (చైనా)తో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని జోడి 23-21, 8-21, 17-21తో ఆరోసీడ్ క్రిషిందా మహేశ్వరి-గ్రేసియా పోలి (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. ముగ్గురూ ఓడారు పురుషుల ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 14-21, 18-21తో టియాన్ హౌవితియాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కుర్రాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి గేమ్‌లో 6-6తో స్కోరు సమమైన తర్వాత శ్రీ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో రాకెట్‌పై పట్టు కోల్పోయి షాట్లలో కచ్చితత్వం లోపించింది. ఇక రెండో గేమ్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన శ్రీకాంత్ 3-3, 10-10, 11-11తో స్కోరును సమం చేశాడు. ఈ దశలో హౌవితియాన్ మూడు పాయింట్లు గెలిస్తే, శ్రీ ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. చివరకు స్కోరు 18-19 ఉన్న దశలో హౌవితియాన్ మూడు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 10-21, 6-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో; హెచ్.ఎస్. ప్రణయ్ 15-21, 14-21తో ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మిం టన్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, సింధు రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. అయితే పురుషుల విభాగంలో మాత్రం శ్రీకాంత్ సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కశ్యప్ కూడా రెండో రౌండ్లోనే ఓడాడు. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్... మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను 11-21, 21-19, 21-19తో ప్రపంచ 17వ ర్యాంకర్ వాన్ హో సన్ (కొరియా)పై విజయం సాధించి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా... శ్రీకాంత్ చివరి రెండు గేమ్‌ల్లో అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో వాన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచాడు. రెండో గేమ్‌లో ఓ దశలో శ్రీకాంత్ వెనకబడ్డా... పుంజుకుని వరుసగా 9 పాయింట్లు సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ మరింత కఠినంగా సాగింది. ఆటగాళ్లిద్దరూ ఒక్కో పాయింట్ గెలవడంతో స్కోరు 3-3, 14-14, 15-15, 16-16తో స్కోరు సమమైంది. ఈ దశలో ఏపీ కుర్రాడు నాణ్యమైన ఆటతీరుతో రాణించి మ్యాచ్ గెలిచాడు. కశ్యప్ అవుట్! పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ మ్యాచ్‌లో జాన్ జుర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో 18-21, 15-21తో ఓడిపోయాడు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. సైనాకు షాక్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఎనిమిదోసీడ్ సైనా 21-16, 10-21, 19-21తో ప్రపంచ 28వ ర్యాంకర్ యావో జూ (చైనా) చేతిలో కంగుతింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచిన ఏపీ అమ్మాయి ఊపుమీద కనిపించింది. అయితే రెండో గేమ్‌లో యావో ఆధిపత్యమే నడవడంతో సైనా ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాదీ ఆధిక్యంలోకి వెళ్లినా నిలబెట్టుకోలేక పోయింది. పోరాడి ఓడిన సింధు మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పి.వి.సింధు 16-21, 19-21తో ఆరోసీడ్ యియాన్ జూ బే (కొరియా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో పేలవ ఆటతీరు, అనవసర తప్పిదాలతో సింధు తడబడింది. రెండో గేమ్‌లో పుంజుకుని 19-15తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జూ బే తన అనుభాన్నంతా ఉపయోగించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి సింధు ఆశలపై నీళ్లు జల్లింది.