కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మిం టన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల విభాగంలో స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, సింధు రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యారు. అయితే పురుషుల విభాగంలో మాత్రం శ్రీకాంత్ సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. కశ్యప్ కూడా రెండో రౌండ్‌లోనే ఓడాడు.
ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్... మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అతను 11-21, 21-19, 21-19తో ప్రపంచ 17వ ర్యాంకర్ వాన్ హో సన్ (కొరియా)పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా... శ్రీకాంత్ చివరి రెండు గేమ్‌ల్లో అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
సుదీర్ఘ ర్యాలీలతో వాన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచాడు. రెండో గేమ్‌లో ఓ దశలో శ్రీకాంత్ వెనకబడ్డా... పుంజుకుని వరుసగా 9 పాయింట్లు సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ మరింత కఠినంగా సాగింది. ఆటగాళ్లిద్దరూ ఒక్కో పాయింట్ గెలవడంతో స్కోరు 3-3, 14-14, 15-15, 16-16తో స్కోరు సమమైంది. ఈ దశలో ఏపీ కుర్రాడు నాణ్యమైన ఆటతీరుతో రాణించి మ్యాచ్ గెలిచాడు.
కశ్యప్ అవుట్!
పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ మ్యాచ్‌లో జాన్ జుర్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో 18-21, 15-21తో ఓడిపోయాడు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
సైనాకు షాక్
మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఎనిమిదోసీడ్ సైనా 21-16, 10-21, 19-21తో ప్రపంచ 28వ ర్యాంకర్ యావో జూ (చైనా) చేతిలో కంగుతింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచిన ఏపీ అమ్మాయి ఊపుమీద కనిపించింది. అయితే రెండో గేమ్‌లో యావో ఆధిపత్యమే నడవడంతో సైనా ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాదీ ఆధిక్యంలోకి వెళ్లినా నిలబెట్టుకోలేక పోయింది.
పోరాడి ఓడిన సింధు
మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పి.వి.సింధు 16-21, 19-21తో ఆరోసీడ్ యియాన్ జూ బే (కొరియా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో పేలవ ఆటతీరు, అనవసర తప్పిదాలతో సింధు తడబడింది. రెండో గేమ్‌లో పుంజుకుని 19-15తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జూ బే తన అనుభాన్నంతా ఉపయోగించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి సింధు ఆశలపై నీళ్లు జల్లింది.
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
Published Fri, Jan 17 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement