క్వార్టర్స్‌లో సైనా
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ శ్రీకాంత్‌కు నిరాశ
కౌలాలంపూర్: ఇటీవల తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటున్న భారత బ్యాడ్మింటన్ మేటి క్రీడాకారిణి సైనా నెహ్వాల్... మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్‌లో మరో అడుగు ముందుకేయగా, పురుషుల విభాగంలో మాత్రం భారత కుర్రాళ్లు చతికిలపడ్డారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సైనా 21-13, 21-9తో క్వాలిఫయర్ జుయ్ యావో (చైనా)పై నెగ్గింది. దీంతో 2014లో జుయ్ చేతిలో తనకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
కేవలం 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాద్ అమ్మాయి కచ్చితమైన షాట్లతో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలిగేమ్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఇద్దరు క్రీడాకారిణిలు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లారు. ఈ గేమ్ మొత్తంలో జుయ్ ఒకే ఒక్కసారి 11-12తో సైనాకు పోటీ ఇచ్చింది. కానీ నెట్ వద్ద మెరుగైన డ్రాప్ షాట్లతో చెలరేగిన హైదరాబాదీ వరుసగా నాలుగు, రెండు, మూడు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో జుయ్ పుంజుకోవడంతో స్కోరు 3-3తో సమమైంది.
ఈ దశలో సైనా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 7-3 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఒకటి, రెండు పాయింట్లతో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లారు. చివరకు స్కోరు 15-9 ఉన్న దశలో సైనా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో సైనా... ప్రపంచ 15వ ర్యాంకర్ సన్ యు (చైనా)తో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని జోడి 23-21, 8-21, 17-21తో ఆరోసీడ్ క్రిషిందా మహేశ్వరి-గ్రేసియా పోలి (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.
ముగ్గురూ ఓడారు
పురుషుల ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 14-21, 18-21తో టియాన్ హౌవితియాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కుర్రాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి గేమ్‌లో 6-6తో స్కోరు సమమైన తర్వాత శ్రీ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో రాకెట్‌పై పట్టు కోల్పోయి షాట్లలో కచ్చితత్వం లోపించింది. ఇక రెండో గేమ్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన శ్రీకాంత్ 3-3, 10-10, 11-11తో స్కోరును సమం చేశాడు. ఈ దశలో హౌవితియాన్ మూడు పాయింట్లు గెలిస్తే, శ్రీ ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. చివరకు స్కోరు 18-19 ఉన్న దశలో హౌవితియాన్ మూడు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 10-21, 6-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో; హెచ్.ఎస్. ప్రణయ్ 15-21, 14-21తో ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.