
కౌలాలంపూర్: సీజన్ తొలి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ ఓపెన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21–18, 23–21తో గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా రెండు గేముల్లోనూ వెనుకంజలో ఉండి కోలుకొని విజయాన్ని దక్కించుకోవడం విశేషం.
తొలి గేమ్‌లో 9–15తో... రెండో గేమ్‌లో 14–18తో సైనా వెనుకబడినా పట్టుదల కోల్పోకుండా పోరాడి ప్రత్యర్థి ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడుతుంది. ముఖాముఖీ రికార్డులో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 23–21, 16–21, 17–21తో సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment