
కౌలాలంపూర్: కొత్త సీజన్‌లో ఆడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే ఫైనల్‌కు చేరాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో సైనా సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 13–21తో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్ ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే సైనాను గతంలో ఐదుసార్లు ఓడించిన మారిన్ వెంటనే కోలుకుంది. దూకుడుగా ఆడుతూ సైనాపై ఒత్తిడి పెంచుతూ వరుసగా ఏడు పాయింట్లు సాధించి 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన మారిన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మారిన్ మరింత విజృంభించగా... సైనా డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో మొదటి పాయింట్ సైనా సాధించినా... ఆ తర్వాత మారిన్ ఆరు పాయింట్లు గెలిచి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఇక వెనుదిరిగి చూడలేదు. సెమీస్‌లో ఓడిన సైనాకు 5,075 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 61 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment