కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ దిగ్గజం, ఐదు సార్లు ప్రపంచ చాంపియన్, రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ 35 ఏళ్ల వయసులోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. గత రెండేళ్లుగా అనామక ఆటగాళ్ల చేతుల్లో వరుస పరాజయాలతో దాదాపు నిష్క్రమించినట్లుగా కనిపించిన అతను మరో పెద్ద విజయంతో సత్తా చాటాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ మలేసియా ఓపెన్‌లో డాన్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో డాన్ తన జూనియర్ చెన్ లాంగ్ (చైనా)పై 9–21, 21–7, 21–11 స్కోరుతో విజయం సాధించాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మలేసియా ఓపెన్ (అప్పట్లో సూపర్ సిరీస్ ప్రీమియర్)ను గెలుచుకున్న అనంతరం డాన్ మరో టైటిల్ సాధించలేకపోయాడు.
ఇప్పుడు మళ్లీ అదే టోర్నీతో అతను తన విలువను ప్రదర్శించాడు. డాన్ చిరకాల ప్రత్యర్థి, ప్రస్తుతం క్యాన్సర్‌నుంచి చికిత్స పొందుతూ ఆటకు దూరంగా ఉన్న లీ చోంగ్ వీ (మలేసియా) విజేతకు బహుమతి అందజేయడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (తైపీ) వరుసగా మూడో సారి గెలుచుకుంది. ఫైనల్లో తై జు 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)ను ఓడించింది. డబుల్స్ ఈవెంట్లన్నీ చైనా షట్లర్లే గెలుచుకున్నారు. పురుషుల డబుల్స్‌లో లి జున్ హు–లి యుచెన్ (చైనా), మహిళల డబుల్స్‌లో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ (చైనా), మిక్స్‌డ్ డబుల్స్‌లో జెంగ్ సివే– హువాంగ్ (చైనా) జోడీలు విజేతలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment