హైదరాబాద్ :రియో ఒలింపిక్స్లో రజిత పతకం సాధించి భారతీయ క్రీడాకారిణిగా అనితర సాధ్యమైన ఘనతను సాధించిన పీవీ సింధు..చిన్ననాటి ముచ్చట్లను ఆమె తల్లిదండ్రులు 'సాక్షి'తో పంచుకున్నారు. సింధు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిందని, ఏ రోజు కూడా ప్రాక్టీస్ను వదిలిపెట్టలేదని ఆమె తల్లిదండ్రులు రమణ, విజయ తెలిపారు. మొదట్లో సింధును కష్టపెడుతున్నామని అందరూ తమను తప్పుపట్టేవారని, ప్రస్తుతం అలాంటివారంతా సింధుతో పాటు తమను కూడా అభినందిస్తున్నారని తెలిపారు.
కాగా సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు.