డాక్టర్ విజయభారతి బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ రాహుల్ బొజ్జా తల్లి
సనత్‌నగర్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి డాక్టర్ విజయభారతి (83) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె, సనత్‌నగర్ రెనోవా నీలిమ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఆమె జన్మించారు.
తెలుగు రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె ఎంఏ తెలుగు లిటరేచర్, అనంతరం పీహెచ్‌డీ చేశారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రచించారు. ముఖ్యంగా ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రలను తన పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డులు ఆమెకు దక్కాయి. విజయభారతి పారి్థవదేహాన్ని ఆదివారం గాంధీ మెడికల్ కళాశాలకు అందించనున్నారు.
ప్రముఖుల సంతాపం: ప్రముఖ రచయిత్రి, ఐఏఎస్ అధికారి బొజ్జా రాహుల్ తల్లి డాక్టర్ విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వంటి రచనలు వెలువరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాహితీరంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవని పేర్కొ న్నారు.
రాహుల్ బొజ్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విజయభారతి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయభారతి మరణంపై సెంటర్ ఫర్ దళిత్ స్టూడెంట్ (సీడీఎస్) చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్‌కృష్ణ సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment