
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోటీల్లో సింధు 21–13, 21–10తో హన్న రమదిని (ఇండోనేసియా)పై, సైనా 22–24, 21–15, 21–14తో ఏడో సీడ్ చెన్ యుఫె (చైనా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మకు మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది. అతను 16–21, 21–12, 10–21తో కజుమస సాకాయ్ (జపాన్) చేతిలో కంగుతిన్నాడు.
పురుషుల డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 21–17తో ఎనిమిదో సీడ్ తకుటో ఇనోయె – యుకి కనెకో (జపాన్) జంటపై విజయం సాధించగా, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడి 18–21, 21–16, 16–21తో లు చింగ్ యో– యంగ్ పొ హన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. పారుపల్లి కశ్యప్ 18–21, 18–21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment