కెంటో మొమోటా
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు.
ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment