Kento momota
-
రాత మార్చేసిన దుర్ఘటన.. 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్
జపాన్ బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం తర్వాత తాను పూర్తిగా కోలుకోలేకపోయానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా జపాన్‌కు చెందిన 29 ఏళ్ల కెంటో మొమోటా ఒకప్పుడు బ్యాడ్మింటన్ రంగంలో మకుటంలేని మహారాజుగా నీరాజనాలు అందుకున్నాడు. 2019లో ఏకంగా 11 టైటిళ్లు సాధించి సత్తా చాటాడు. ఆ ఏడాది ఆడిన 73 మ్యాచ్‌లలో మొమోటా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయాడు. అయితే, ఆ మరుసటి ఏడాది మొమోటా కారు ప్రమాదానికి గురయ్యాడు. మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తర్వాత కౌలలంపూర్ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాద ఘటనలో నుజ్జునుజ్జయింది. ఆ కారు డ్రైవర్ చనిపోగా.. మొమోటాకు తీవ్ర గాయాలయ్యాయి. మొమోటా కంటికి బలమైన దెబ్బ తలగడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో రెండు టైటిళ్లు గెలిచిన మొమోటా.. ఏడాది తర్వాత రెండో కంటి చూపు కూడా మందగించడంతో ఫామ్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ‘‘కారు ప్రమాదం జరిగిన సమయంలో నేను నా గురించి ఆందోళన చెందలేదని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. ఆడాలనే తపన ఉన్నా నా శరీరం అందుకు సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం. అయితే, ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు’’ అని కెంటో మొమోటా చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్‌గా వెలుగొందిన మొమోటా ప్రస్తుతం 52వ ర్యాంకులో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన అతడు.. థామస్, ఉబెర్ కప్ తర్వాత ఆటకు దూరం కానున్నాడు. -
BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం
తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ... ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్ పెను సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన జపాన్ స్టార్ కెంటో మొమోటాను ప్రణయ్ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో ప్రణయ్ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్య సేన్ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ అవుట్... గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 17–21తో ఓడిపోయాడు. పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్–అశ్విని భట్ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ కిమ్ సో యోంగ్–కాంగ్ హి యోంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్ సీడ్ చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్ పియర్లీ తాన్–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. ధ్రువ్–అర్జున్ జోడీ అద్భుతం పురుషుల డబుల్స్‌లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్ జొనాథన్–అనిబెల్ మార్క్విన్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జెప్ బే–లాసి మోల్డే (డెన్మార్క్)లతో సాత్విక్–చిరాగ్... హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ (సింగపూర్)లతో అర్జున్–ధ్రువ్ ఆడతారు. -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు మొమోటా దూరం
Kento Momota Ruled Out From World Badminton Championship.. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగాడు. ఈనెల 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొమోటా 2018, 2019లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్స్‌ను సాధించాడు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇండోనేసియా ఆటగాళ్లందరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటంలేదని ప్రకటించారు. -
వరల్డ్ చాంపియన్ కెంటో మొమొటాకు షాక్
టోక్యో: విదేశీ వేదికలపై అసాధారణ విజయాలు సాధిస్తున్న జపాన్ స్టార్లు సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ చాంపియన్ నయోమి ఒసాకా మూడో రౌండ్లో ఓడినట్లే బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమొటా కూడా గ్రూప్ దశ దాటలేకపోయాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన మొమొటా బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 15–21, 19–21తో హియో క్వాంగి (దక్షిణ కొరియా) చేతిలో కంగుతిన్నాడు. వరుసగా రెండు విజయాలతో క్వాంగి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఇతర గ్రూప్‌ల నుంచి కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)... మార్క్ కల్జూ (నెదర్లాండ్స్)... అక్సెల్సన్ (డెన్మార్క్)... జు వె వాంగ్ (చైనీస్ తైపీ)... జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)... షి యుకీ (చైనా)... కాంటా సునెయామ (జపాన్)... జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)... టోబీ పెంటీ (బ్రిటన్)... ఆంటోన్సెన్ (డెన్మార్క్)... లీ జి జియా (మలేసియా)... చెన్ లాంగ్ (చైనా)... తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. -
మొమోటా... పూర్తి ఫిట్‌గా
టోక్యో: ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా శుక్రవారం ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీ విజేతగా నిలిచిన అనంతరం స్వదేశానికి వెళ్లేందుకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో మొమోటా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా... మొమోటా సిబ్బందికీ గాయాలయ్యాయి. మొమోటా కంటికి గాయం కావడంతో ఫిబ్రవరిలో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. ‘ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూడగలుగుతున్నా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గతంలో లాగే ఆడుతున్నట్లు అనిపిస్తోంది’ అని మొమోటా అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే తన తదుపరి లక్ష్యం అని మొమోటా పేర్కొన్నాడు. -
రోడ్డు ప్రమాదంలో మొమోటాకు గాయాలు
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో మొమోటా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. మంగళవారం ఆరంభమయ్యే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ నుంచి అతను వైదొలిగాడు. దాంతో స్వదేశానికి బయలుదేరేందుకు సోమవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న వ్యాన్ హైవేపై లారీని బలంగా ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ 24 ఏళ్ల బావన్ సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మొమోటాతోపాటు ఆ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఫిజియోథెరపిస్ట్ మొరిమోటో అకిఫుమి (జపాన్), అసిస్టెంట్ కోచ్ హిరయామ (జపాన్), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సాంకేతిక అధికారి థామస్ (బ్రిటన్) కూడా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీళ్లందరిని స్థానిక పుత్రజయ ఆసుపత్రికి తరలించారు. మొమోటా ముక్కుకు, ముఖానికి గాయాలయ్యాయని... పెదవులకు కుట్లు వేశారని ... ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని మొమోటాను పరామర్శించిన అనంతరం మలేసియా క్రీడల మంత్రి సయ్యద్ సాదిక్ తెలిపారు. మలేసియా ప్రధానమంత్రి మహాథిర్ మొహమ్మద్ భార్య సితి హాస్మా అలీ, మలేసియా దిగ్గజ షట్లర్ లీ చోంగ్ వీ కూడా మొమోటాను పరామర్శించి వెళ్లారు. గత ఏడాది మొమోటా ఏకంగా 11 టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మొమోటాను పరామర్శిస్తున్న మలేసియా ప్రధాని భార్య సితి హాస్మా అలీ -
మొమోటా మ్యాజిక్...
ఈ సంవత్సరం మొమోటా చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. గ్వాంగ్జౌ (చైనా): తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) 2019 సీజన్‌ను టైటిల్‌తో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మొమోటా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మొమోటా 87 నిమిషాల్లో 17–21, 21–17, 21–14తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది మొమోటా 12 టోరీ్నల్లో ఫైనల్స్ చేరగా... 11 టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. తద్వారా బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు లీ చోంగ్ వీ (మలేసియా), వాంగ్ జియోలి–యు యాంగ్ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీ చోంగ్ వీ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ నెగ్గగా... 2011లో వాంగ్ జియోలి–యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది. జిన్‌టింగ్‌తో జరిగిన ఫైనల్లో మొమోటా అద్భుతమే చేశాడు. తొలి గేమ్ కోల్పోయిన ఈ జపాన్ స్టార్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 5–12తో ఏడు పాయింట్లతో వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ టోర్నీకంటే ముందు తాను ఆడిన నాలుగు టోర్నీల ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన జిన్‌టింగ్ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన మొమోటా స్కోరును 12–12తో సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 15–14 వద్ద మొమోటా ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు. దాంతో జిన్‌టింగ్ ఈ ఏడాది ఆడిన ఐదు టోరీ్నల ఫైనల్స్‌లో ఓటమిని మూటగట్టుకున్నాడు. చాంపియన్ మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్ జిన్టింగ్కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
అయ్యో...శ్రీకాంత్!
హాంకాంగ్: తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించడం... కీలక క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) గాయంతో వైదొలగడం... వెరసి ఎనిమిది నెలల తర్వాత ఓ టోర్నీ లో సెమీఫైనల్ చేరే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ భారంగా నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 23–25తో ప్రపంచ 27వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి గేమ్‌లోనైతే పూర్తిగా గతి తప్పిన అతను రెండో గేమ్‌లో తేరుకున్నాడు. నిలకడగా ఆడుతూ ఒకదశలో 20–15తో ఐదు గేమ్ పాయింట్లను సంపాదించాడు. మరో పాయింట్ గెలిస్తే మ్యాచ్‌లో నిలిచే స్థితిలో తీవ్ర ఒత్తిడికి లోనైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకున్నాడు. స్కోరు 20–20తో సమమైన దశలో శ్రీకాంత్ మళ్లీ పాయింట్ గెలిచి 21–20తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 21–21తో స్కోరు మళ్లీ సమమయ్యాక శ్రీకాంత్ మరో పాయింట్ గెలిచి 22–21తో ఏడోసారి గేమ్ పాయింట్ సంపాదించాడు. అయితే లీ చెయుక్ పట్టుదలతో పోరాడి స్కోరును 22–22తో, ఆ తర్వాత 23–23తో సమం చేశాడు. ఈ దశలో లీ చెయుక్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది 14 టోర్నమెంట్లలో పాల్గొన్న శ్రీకాంత్... ఐదు టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్‌కు, మూడు టోరీ్నల్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, ఒక టోరీ్నలో ఫైనల్‌కు, మరో టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరుకొని నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లో ని్రష్కమించాడు. ఈ సీజన్లో మరో రెండు టోరీ్నలకు శ్రీకాంత్ ఎంట్రీలను పంపించాడు. ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే కొరియా మాస్టర్స్ టోర్నీలో, ఈనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే సయ్యద్ మోడీ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతాడు. -
మొమోటా @10
ఫుజౌ (చైనా): జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా ఈ ఏడాది పదో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్న ఫైనల్లో మొమోటా 21–15, 17–21, 21–18తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీ చోంగ్ వీ (మలేసియా–2010లో 9 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును మొమోటా బద్దలు కొట్టాడు. ఈ ఏడాది మరో టైటిల్ సాధిస్తే మొమోటా ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం జియోలి వాంగ్–యు యాంగ్ (చైనా–మహిళల డబుల్స్‌లో 10 టైటిల్స్; 2011లో) ద్వయం పేరిట ఉన్న రికార్డును మొమోటా సమం చేశాడు. -
ప్చ్... కశ్యప్
ఇంచువాన్ (దక్షిణకొరియా): కొరియా ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ విజయ పరంపర సెమీఫైనల్‌తో ముగిసింది. టోర్నీలో సింధు, సైనా, సాయి ప్రణీత్ సహా మిగతా స్టార్ షట్లర్ల పోరాటం తొలి రౌండ్‌తోనే ముగిసినా... సెమీస్ వరకు వచ్చిన కశ్యప్‌కు ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్) అడ్డుకట్ట వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ఆటగాడు 13–21, 15–21తో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ మొమోటా 40 నిమిషాల్లో కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా ఒక్కో అడుగు వేస్తూ వచి్చన కశ్యప్ టాప్ సీడ్ ధాటికి సెమీస్‌లో నిలువలేకపోయాడు. తొలి గేమ్ ఆరంభమైన కాసేపటికే జపాన్ ఆటగాడు 9–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. మధ్యలో పాయింట్లు సంపాదించినా మొమోటా ముందు అవి సరిపోలేదు. రెండో గేమ్‌లో 7–2తో ఆధిపత్యం చాటిన టాప్‌సీడ్ కొన్ని అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయాడు. ఇదే అదనుగా కశ్యప్ 11–12 స్కోరుతో దీటుగా కదిలాడు. వెంటనే తేరుకున్న జపాన్ స్టార్ వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–13 స్కోరుకు చేరాడు. తర్వాత మ్యాచ్ గెలిచేందుకు అతడికి మరెంతోసేపు పట్టలేదు. కశ్యప్‌కు మొమోటా చేతిలో ఇది మూడో ఓటమి. -
సెమీస్‌తో సరి
టోక్యో: ఊహించిన ఫలితమే వచ్చింది. సెమీఫైనల్ చేరే క్రమంలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... సెమీఫైనల్లో మాత్రం తన శక్తిమేర పోరాడినా సంచలన ఫలితం నమోదు చేయలేకపోయాడు. ఫలితంగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 18–21, 12–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో 11వ ర్యాంకర్ నిషిమోటో (జపాన్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ ర్యాంకర్ సునెయామ (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 18వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందిన సాయిప్రణీత్‌కు సెమీస్‌లో ఓటమితో 10,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 23 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెంటో మొమోటాతో ఐదోసారి తలపడిన సాయిప్రణీత్ ఈసారి వరుస గేముల్లో ఓడిపోయాడు. ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లో కెంటో మొమోటాకు మూడు గేమ్‌లపాటు ముచ్చెమటలు పట్టించిన ఈ తెలుగు తేజం ప్రస్తుత పోరులో 45 నిమిషాల్లో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో మొమోటా పైచేయి సాధించాడు. ఒకదశలో 6–11తో వెనుకబడిన సాయిప్రణీత్ అద్భుత ఆటతో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి స్కోరును 11–11తో సమం చేశాడు. కానీ వెంటనే తేరుకున్న మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలో సాయిప్రణీత్ దూకుడుగా ఆడుతూ 9–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మొమోటా సాధికారిక ఆటతీరుకుతోడు అనవసర తప్పిదాలు చేసిన సాయిప్రణీత్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. 9–12తో వెనుకంజలో నిలిచాడు. ఆ తర్వాత సాయిప్రణీత్ కోలుకొని 12–14తో ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించాడు. ఈ దశలో మొమోటా ఒక్కసారిగా గేర్ మార్చాడు. వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి 21–12తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ‘మ్యాచ్‌లో అడపాదడపా బాగా ఆడాను. కెంటో మొమోటాను ఓడించడం అంత సులువు కాదు. ఏ రకంగా ఆడినా అతని నుంచి సమాధానం వస్తోంది. దూకుడుగా ఆడినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడినా... రక్షణాత్మకంగా ఆడినా... స్మాష్ షాట్లు సంధించినా... మొమోటా దీటుగా బదులు ఇస్తున్నాడు. తనదైన శైలి ఆటతో ప్రత్యర్థి ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఆడించాలో అతనే శాసిస్తున్నాడు’ –సాయిప్రణీత్ -
మొమోటా మెరిసె...
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది. -
జూదగాడు... జగజ్జేత
సరిగ్గా మూడేళ్ల క్రితం జపాన్ బ్యాడ్మింటన్‌కు సంబంధించి కెంటో మొమోటా అతి పెద్ద హీరో. అప్పటికే అనేక పెద్ద విజయాలతో దూసుకొచ్చిన 20 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా సత్తా చాటి ఆ దేశం తరఫున సింగిల్స్‌లో పతకం (కాంస్యం) సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరో ఏడాది తర్వాత జరిగే రియో ఒలింపిక్స్‌లో కూడా తమ దేశానికి పతకం అందించగలడని అందరూ అతనిపై ఆశలు పెంచుకున్నారు. అయితే కొన్ని నెలల్లోనే సీన్ మారిపోయింది. మొమోటా చేసిన తప్పు అతడికి ఒలింపిక్స్ అవకాశాలనే కాదు దేశంలో అభిమానులను కూడా దూరం చేసేసింది. జూదం ఆడి శిక్షకు గురైన అతను ఇప్పుడు ప్రపంచ వేదికపై విజేతగా నిలిచి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. సాక్షి క్రీడావిభాగం : 2016 ఏప్రిల్‌లో జపాన్ బ్యాడ్మిం టన్ సమాఖ్య నిషేధం విధించే నాటికి మొమోటా అనామకుడేమీ కాదు. ఆ సమయంలో వరల్డ్ నంబర్–2గా కొనసాగుతున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాం స్యం, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ విజేత, రెండు సూపర్ సిరీస్ ప్రీమియర్, మరో సూపర్ సిరీస్ టైటిల్స్వంటి ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు మరో రెండు గ్రాండ్‌ప్రి విజయాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అంతకుముందే వరల్డ్, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణ, కాంస్యాలు... జపాన్‌లో మొమోటా సూపర్ స్టార్‌గా మారేందుకు పునాది వేశాయి. అయితే ఆటగాడిగా ఈ ఘనతలన్నీ అతడిని కాపాడలేకపోయాయి. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాడనే నమ్మకం ఉన్నా సరే... అతని క్రమశిక్షణారాహిత్యానికి జపాన్ సమాఖ్య నిర్దాక్షిణ్యంగా శిక్ష విధించింది. క్యాసినోకు వెళ్లి... మరో జపాన్ సీనియర్ క్రీడాకారుడు కెనిచి టాగోతో స్నేహం మొమోటాకు చేటు చేసింది. అతనితో కలిసి బయటి సరదాలకు అలవాటు పడిన అతను వరుసగా జట్టు ప్రాక్టీస్ సెషన్లకు డుమ్మా కొట్టాడు. ఇతర ఆటగాళ్లపై ఇది ప్రతికూలం ప్రభావం చూపిస్తోందని ముందుగా హెచ్చరించిన సమాఖ్య, ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించి మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణలో మొమోటా అక్రమ క్యాసినోలకు వెళ్లి జూదమాడుతున్నట్లు తేలింది. జపాన్‌లో గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. ఫెడరేషన్ విచారణలో తాను ఆరు సార్లు జూదశాలకు వెళ్లినట్లు, మొత్తం 5 లక్షల జపాన్ యెన్లు (రూ. 3 లక్షలు) పోగొట్టుకున్నట్లు అతను చెప్పాడు. మరోవైపు ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న మొమోటాను తానే తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లానని, తనకు ఎలాంటి శిక్ష విధించినా సిద్ధం కానీ అతడిని మాత్రం క్షమించమని టాగో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అయితే జపాన్ క్రీడా మంత్రి మాత్రం ‘జూదమాడటం ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధం. అలాంటివాడికి ఒలింపిక్స్ ఆడే అర్హత లేదు’ అంటూ నిషేధం ప్రకటించడంతో మొమోటా కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయింది. అతనిపై శిక్షను కూడా జపాన్ ఎంతో కొంత కాలానికే పరిమితం చేయకుండా ‘నిరవధిక నిషేధం’ అని ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది. ఏడాది తర్వాత... ఒక వ్యక్తిగత క్రీడలో 22 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న సమయంలో ఈ తరహా ఎదురు దెబ్బ తినడం ఆ ఆటగాడిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుచూపు మేరలో ఎలాంటి భవిష్యత్తు కనిపించలేదు. అయితే ఏదోలా ధైర్యం చేసుకున్న కెంటో షటిల్‌ను మాత్రం వదలి పెట్టలేదు. దిగువ స్థాయి స్థానిక లీగ్‌లలో పాల్గొనడంతో పాటు ఎలాంటి వివాదానికి తావులేకుండా తన ఆటను కొనసాగించాడు. మరోవైపు శిక్షలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. దాంతో అతని ప్రవర్తనపై సంతృప్తి చెందిన జపాన్ ఫెడరేషన్ ఊహించని బహుమతిని అందించింది. గత ఏడాది మార్చిలో మొమోటా నిషేధం మే 15తో ముగుస్తుందని ప్రకటించింది. అంతే... ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన ఈ జపాన్ స్టార్ దూసుకుపోయాడు. ర్యాంకింగ్ 250 దాటిపోవడంతో చిన్న టోర్నీలు, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడుతూనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వరల్డ్ చాంపియన్‌గా నిలవడం అద్భుతం. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో అతను ఓడించిన ఆటగాళ్ళలో లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), కిడాంబి శ్రీకాంత్ (భారత్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), సన్ వాన్ హో (దక్షిణ కొరియా), షి యుకి (చైనా)లాంటి టాప్ షట్లర్లు ఉన్నారు. పునరాగమనం తర్వాత అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, సూపర్–1000 టోర్నీ ఇండోనేసియా ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాడు. కెరీర్లో అనూహ్య మలుపుల తర్వాత జగజ్జేతగా నిలిచిన మొమోటా, ఇక సొంతగడ్డపై 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తేనే తన కెరీర్‌కు సార్థకత అని ప్రకటించడం విశేషం. కెంటో మొమోటా ప్రొఫైల్ పుట్టిన తేదీ: సెప్టెంబర్ 1, 1994 ఎత్తు: 5 అడుగుల 9 అంగుళాలు బరువు: 68 కేజీలు; ఆడే శైలి: ఎడమచేతి వాటం ప్రస్తుత ర్యాంక్: 7; అత్యుత్తమ ర్యాంక్: 2 (ఏప్రిల్, 2016) ఈ ఏడాది గెలిచిన సింగిల్స్ మ్యాచ్‌లు: 33 కెరీర్లో నెగ్గిన సింగిల్స్ మ్యాచ్‌లు: 222 -
మోమోటా మెరిసె...
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కెంటా మోమోటా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మోమోటా 21–17, 21–13తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించాడు. జపాన్‌లో జూదం ఆడటంపై నిషేధం ఉంది. 2016లో మోమోటా జూదం ఆడుతూ దొరికిపోవడంతో అతన్ని జపాన్ బ్యాడ్మింటన్ సంఘం ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టు నుంచి తొలగించింది. గతేడాది మేలో నిషేధం గడువు పూర్తయ్యాక పునరాగమనం చేసిన అతను చిన్న స్థాయి టోర్నీలు ఆడుతూ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. 23 ఏళ్ల మోమోటా ఆసియా చాంపియన్‌షిప్‌లో పూర్వ వైభవాన్ని సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) నిలబెట్టుకుంది. టాప్ సీడ్ తై జు యింగ్ 21–19, 22–20తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. -
రచనోక్, మొమోటాలకు టైటిల్స్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), కెంటో మొమోటా (జపాన్) విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రచనోక్ 21-17, 21-18తో లీ జురుయ్ (చైనా)పై, పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21-15, 21-18తో అక్సెల్సన్ (డెన్మార్క్)పై గెలిచార