
టోక్యో: ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా శుక్రవారం ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీ విజేతగా నిలిచిన అనంతరం స్వదేశానికి వెళ్లేందుకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో మొమోటా తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా... మొమోటా సిబ్బందికీ గాయాలయ్యాయి. మొమోటా కంటికి గాయం కావడంతో ఫిబ్రవరిలో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. ‘ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూడగలుగుతున్నా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గతంలో లాగే ఆడుతున్నట్లు అనిపిస్తోంది’ అని మొమోటా అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే తన తదుపరి లక్ష్యం అని మొమోటా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment