ప్రమాద దృశ్యం
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో మొమోటా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచాడు. మంగళవారం ఆరంభమయ్యే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ నుంచి అతను వైదొలిగాడు. దాంతో స్వదేశానికి బయలుదేరేందుకు సోమవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న వ్యాన్ హైవేపై లారీని బలంగా ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ 24 ఏళ్ల బావన్ సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
మొమోటాతోపాటు ఆ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఫిజియోథెరపిస్ట్ మొరిమోటో అకిఫుమి (జపాన్), అసిస్టెంట్ కోచ్ హిరయామ (జపాన్), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సాంకేతిక అధికారి థామస్ (బ్రిటన్) కూడా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీళ్లందరిని స్థానిక పుత్రజయ ఆసుపత్రికి తరలించారు. మొమోటా ముక్కుకు, ముఖానికి గాయాలయ్యాయని... పెదవులకు కుట్లు వేశారని ... ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని మొమోటాను పరామర్శించిన అనంతరం మలేసియా క్రీడల మంత్రి సయ్యద్ సాదిక్ తెలిపారు. మలేసియా ప్రధానమంత్రి మహాథిర్ మొహమ్మద్ భార్య సితి హాస్మా అలీ, మలేసియా దిగ్గజ షట్లర్ లీ చోంగ్ వీ కూడా మొమోటాను పరామర్శించి వెళ్లారు. గత ఏడాది మొమోటా ఏకంగా 11 టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
మొమోటాను పరామర్శిస్తున్న మలేసియా ప్రధాని భార్య సితి హాస్మా అలీ
Comments
Please login to add a commentAdd a comment