
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఈ కాన్సరెన్స్‌ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం.