‘కాంబోడియా’ కేసులో మరో ఇద్దరు ఏజెంట్ల అరెస్టు | Two more agents arrested in Cambodia case | Sakshi
Sakshi News home page

‘కాంబోడియా’ కేసులో మరో ఇద్దరు ఏజెంట్ల అరెస్టు

Published Mon, May 27 2024 4:42 AM | Last Updated on Mon, May 27 2024 4:42 AM

Two more agents arrested in Cambodia case

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల పేరిట యువకులకు వల  

కమీషన్‌కు కక్కుర్తిపడి నట్టేట ముంచుతున్న ఏజెంట్లు 

చైనా కంపెనీల చేతిలో చిక్కుకుని లబోదిబోమంటున్న బాధితులు  

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటింగ్‌ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను విదేశాలకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖపట్నం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్‌ కాంబోడియా పేరిట సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్న సుమారు 25 మంది యువకులను నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవిశంకర్‌ చొరవతో క్షేమంగా విశాఖకు తీసుకువచి్చన విషయం తెలిసిందే. ఇంకా కాంబోడియాలో చిక్కుకొని ఉండిపోయిన బాధితులను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఆయన విడుదలచేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్‌ నేరాలను అరికట్టడానికి, వాటి మూలాలు ఛేదించడానికి విశాఖ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.ఫకీరప్ప పర్యవేక్షణలో విశాఖ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్‌ వంటి దేశాలకు యువకులను పంపిస్తున్న గాజువాక, భానుజీనగర్‌ ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకోగా విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. కన్సల్టెన్సీ ఏజెంట్‌ కొలుకుల వీరేంద్రనాథ్‌(37) ఇంజనీరింగ్‌ చదివి 2023 నుంచి కాంబోడియా దేశానికి ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను పంపిస్తున్నాడు.

అనకాపల్లికి చెందిన రామకృష్ణను పరిచయం చేసుకొని, తాను కాంబోడియా దేశం నుంచి వచ్చానని, అక్కడికి కంప్యూటర్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌గా పంపిస్తే మంచి కమీషన్‌ వస్తుందని చెప్పాడు. కంప్యూటర్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న 17 మంది నుంచి రూ.లక్షా 20 వేల చొప్పున తీసుకుని పంపించారు. వారికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు కమీషన్‌ లభించింది. అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీరేంద్రనాథ్, అతని భార్య శ్రీప్రియ కాంబోడియా ఏజెంట్‌కు అనేక మంది సిస్టమ్‌ ఆపరేటర్స్‌ను పలు దఫాలుగా పంపించారు. వీరిలో కొంతమందిని విజిటింగ్‌ వీసాపైన బ్యాంకాక్‌ పంపించి అక్కడ నుంచి కాంబోడియా దేశం బోర్డర్‌ వద్ద ఆ దేశ వీసా తీసుకుని అక్కడి చైనా కంపెనీలకు ఈ నైపుణ్యం గల వ్యక్తులను 2500 నుంచి 4,000 అమెరికన్‌ డాలర్లకు విక్రయించారు.   

చీకటి రూమ్‌లో బంధించి.. 
అక్కడికి వెళ్లిన యువకులను చైనా కంపెనీలు అదుపులోకి తీసుకుని ఓ చీకటి గదిలో బంధించేవారు. వివిధ రకాల సైబర్‌ నేరాలు ఏ విధంగా చేయాలనే అంశంపై బలవంతంగా స్క్రిప్ట్‌ ఇస్తూ ట్రైనింగ్‌ ఇవ్వడమే గాక సైబర్‌ నేరాలు చేయిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురిచేస్తారు. ఆహారం, నీరు ఇవ్వకుండా కట్టిపడేస్తుంటారు. వారి వలలో చిక్కుకున్న తర్వాత బయటపడడం అసాధ్యం. చేసిన నేరాల ద్వారా సంపాదించిన డబ్బులో 1 శాతం కమీషన్‌ ఇస్తూ 99 శాతం కంపెనీలే తీసుకుంటాయి. వీరంతా ఉత్సాహంగా పనిచేసేందుకు పలు రకాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అలవాటుచేస్తారు.

పబ్స్, కేసినో గేమ్స్, మద్యపానం, జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు సంపాదించిన డబ్బును ఖర్చుపెట్టేలా తయారు చేస్తున్నారు. చైనా కంపెనీ చెర నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న బాధితుడు పెమ్మడి చిరంజీవి, కల్యాణ్, శేఖర్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిటీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీప్రసాద్‌ విచారణ చేపట్టగా స్కామ్‌ బయటపడింది. ఈ రాకెట్‌లో ప్రధాన నిందితుడు చుక్క రాజే‹Ù, అతని వద్ద పనిచేస్తున్న సబ్‌ ఏజెంట్లు గాజువాకకు చెందిన సబ్బవరపు కొండల­రావు, మన్నేన జ్ఞానేశ్వరరావును ఇంతకుముందే అరెస్టు చేశారు. తాజాగా కొలుకుల వీరేంద్రనా«థ్, కొమ్ము ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.   

ప్రత్యేక బృందం 
దీని వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టడానికి లోతైన దర్యాప్తు చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. అందుకు స్పెషల్‌ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లయితే సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీప్రసాదరావు (సెల్‌ నంబర్‌ 9490617917)కు, కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 0891–2565454కు, లేదా సీపీ వాట్సప్‌ నంబరు 9493336633కు ఫిర్యాదు చేయవచ్చు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930కి నంబర్‌కు కూడా కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement