క్వార్టర్స్‌లో ప్రణీత్‌ | PV Sindhu, Sai Praneeth in quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ప్రణీత్‌

Published Fri, Aug 23 2019 5:33 AM | Last Updated on Fri, Aug 23 2019 5:33 AM

PV Sindhu, Sai Praneeth in quarterfinals - Sakshi

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సాయి ప్రణీత్‌ (భారత్‌) నిలకడగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌ పోరులో 16వ సీడ్‌ సాయి ప్రణీత్‌ 21–19, 21–13తో ఆరో సీడ్‌ ఆంథోని జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణీత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలతో, స్మాష్‌ షాట్లతో హోరెత్తించాడు.

ఆరంభంలో తడబడినా...
జిన్‌టింగ్‌ మ్యాచ్‌ను ధాటిగా ఆరంభిం చాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న అతను 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వెంటనే తేరుకున్న ప్రణీత్‌ వరుసగా 4 పాయింట్లు సాధించి 4–3తో ఆధిక్యంలోకొచ్చాడు.  ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15–15తో సమానంగా నిలి చారు. కీలక సమయం లో ఒత్తిడిని జయించిన ప్రణీత్‌ వరుసగా 4 పాయింట్లు సాధించి 21–17తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌ చేరడం ప్రణీత్‌కిది రెండోసారి. 2018లో కూడా అతను క్వార్టర్స్‌ చేరాడు. నేడు జరిగే క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్‌ తలపడతాడు.

సింధు అలవోకగా...
మహిళల విభాగంలో ఐదో సీడ్‌ పీవీ సింధు పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్స్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన సింధు ప్రత్యర్థికి తన స్మాష్‌ షాట్లతో ముచ్చెమటలు పట్టించింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడుతుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో జరిగిన మరో ప్రి క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 21–15, 25–27, 12–21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

శ్రీకాంత్, ప్రణయ్‌ ఔట్‌
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ల పోరాటం ముగిసింది. గురువారం 46 నిమిషాల పాటు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ప్రణయ్‌ 19–21, 12–21తో టాప్‌ సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్‌లో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రణయ్‌ మ్యాచ్‌ ఓడినా ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్‌లో ఇరువురు 18–18తో సమంగా ఉన్న సమయంలో... ఆ తర్వాతి పాయింట్‌ కోసం ఆటగాళ్ల మధ్య ఏకంగా 57 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన ప్రణయ్‌ తర్వాత గేమ్‌నూ సమర్పించుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొమోటా సునాయాసంగా గెలిచేశాడు. మరో ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ఏడో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ 14–21, 13–21తో కాంతాపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో చిత్తయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement