టోక్యో: ఈ ఏడాది థామస్ కప్‌లో భారత్ తొలిసారి చాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్‌తోపాటు పతకం కూడా లభించనుంది.
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్.
అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు.
సైనాకు నిరాశ
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.
పతకాలకు విజయం దూరంలో...
Published Fri, Aug 26 2022 4:51 AM | Last Updated on Fri, Aug 26 2022 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment