World Badminton Championships
-
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్‌లో భారత్ తొలిసారి చాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్‌తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం
తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ... ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్ పెను సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన జపాన్ స్టార్ కెంటో మొమోటాను ప్రణయ్ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో ప్రణయ్ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్య సేన్ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ అవుట్... గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 17–21తో ఓడిపోయాడు. పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్–అశ్విని భట్ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ కిమ్ సో యోంగ్–కాంగ్ హి యోంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్ సీడ్ చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్ పియర్లీ తాన్–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. ధ్రువ్–అర్జున్ జోడీ అద్భుతం పురుషుల డబుల్స్‌లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్ జొనాథన్–అనిబెల్ మార్క్విన్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జెప్ బే–లాసి మోల్డే (డెన్మార్క్)లతో సాత్విక్–చిరాగ్... హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ (సింగపూర్)లతో అర్జున్–ధ్రువ్ ఆడతారు. -
BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా యమగుచి
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో జరిగిన తుది పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జపాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యమగుచి పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు ప్రపంచ రెండో సీడ్, థాయ్ జోడీ డెచాపోల్ పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ ద్వయం ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్ జపాన్ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. చదవండి: బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు.. -
సింధు, శ్రీకాంత్ ముందుకు...
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ వేటను భారత స్టార్ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ తెలుగు తేజం మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 21–7, 21–9తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై అలవోకగా గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు కేవలం 24 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి కథను ముగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. తొలి గేమ్‌లో స్కోరు 5–4 వద్ద సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా 12 పాయింట్లు గెలిచి 17–4తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో గేమ్‌లోనూ ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తన జోరు కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ముందంజ వేసిన సింధు అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ చోచువోంగ్ (థాయ్ లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 4–3తో ఆధిక్యంలో ఉంది. చెమటోడ్చి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, భారత యువతార లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించారు. రెండో రౌండ్ అడ్డంకిని దాటడానికి వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. ప్రపంచ 63వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–18, 21–17తో గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో ఒకదశలో 6–9తో వెనుకంజలో ఉన్నాడు. ఈ దశలో శ్రీకాంత్ చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే ఉత్సాహంలో శ్రీకాంత్ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 10–13తో వెనుకబడిన దశలో మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గట్టెక్కాడు. 82 నిమిషాల్లో... ప్రపంచ 17వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 15–21, 21–18తో విజయం సాధించాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని లక్ష్య సేన్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లూ గ్వాంగ్ జు (ౖచైనా)తో శ్రీకాంత్; కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)తో లక్ష్య సేన్ తలపడతారు. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సాత్విక్–చిరాగ్ ద్వయం 43 నిమిషాల్లో 27–25, 21–17తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో అనుష్క పారిఖ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 8–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం జూలై–ఆగస్టుకు వాయిదా పడటంతో బీడబ్ల్యూఎఫ్ తమ మెగా టోర్నీ షెడ్యూల్లో మార్పులు చేసింది. -
సింధు విజయం స్ఫూర్తిదాయకం
‘విజేతల పతకాలు తయారయ్యేది చెమట, పట్టుదల, సాహసమనే అరుదైన మిశ్రమ లోహంతో’అని అమెరికన్ మల్లయోధుడు, ఒకనాటి ఒలింపిక్స్ స్వర్ణ విజేత డాన్ గేబుల్ అంటాడు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఆదివారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని ఒడిసిపట్టి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం సింధుకు ఈ మాటలు అక్షరాలా వర్తిస్తాయి. ఇంతక్రితం బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు త్రుటిలో చేజారిన స్వర్ణాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకోసం ఆమె నిర్విరామంగా శ్రమించిన తీరు అత్యద్భుతం. కనుకనే భారత బ్యాడ్మింటన్ చరిత్రలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా సింధు నమోదైంది. రెండుసార్లు కాంస్య పతకాలు, మరో రెండుసార్లు రజత పతకాలు గెల్చుకున్నా ఆమె సంతృప్తి పడలేదు. ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా అవతరించిన ఈ క్షణంలో కూడా ఆమె వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌లో సైతం తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అక్కడ సైతం సమున్నత విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది. సింధు చెప్పినట్టు ఈ చరిత్రాత్మక విజయం ఆమె బాధ్యతను మరింత పెంచింది. ఈ ఆట ఆమెపై ఉన్న అంచనాలను అనేక రెట్లు పెంచింది. బాసెల్‌లో జరిగిన పోరు వాస్తవానికి ఏకపక్షంగా సాగింది. కేవలం 37 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి ఒకుహరను సింధు మట్టికరిపించింది. రెండేళ్లక్రితం అదే క్రీడాకారిణి తనను ఎదుర్కొన్న తీరు తలుచుకుని ఆద్యంతమూ దూకుడుగా ఆడింది. ఒకుహరకు ఈసారి ఏమాత్రం అవకాశమీయరాదన్న రీతిలో చెలరేగింది. కనుకనే తొలి గేమ్ 16 నిమిషాల్లోనే ఆమె వశమైంది. ఆ తర్వాత కూడా సింధు ఎక్కడా తగ్గలేదు. రెండో గేమ్‌లో సైతం ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. సింధు ఆడిన తీరును గమనిస్తే అందులో ఆమె సాధించిన నైపుణ్యం కళ్లకు కడుతుంది. 2017లోనూ అంతే. అప్పుడు ఒకుహర విజయం సాధించి ఉండొచ్చుగానీ, ఆమెను సింధు చివరివరకూ ముప్పుతిప్పలు పెట్టింది. 110 నిమిషాలు సాగిన ఆ మ్యాచ్ ప్రపంచ క్రీడాభిమానులందరినీ ఎంతగానో అలరించింది. ఆనాటి చాంపియన్‌కు సింధు ఇప్పుడేమాత్రం అవకాశమీయలేదు. కేవలం 37 నిమిషాల్లోనే అంతా ముగించింది. వరస స్మాష్‌లతో, రిటర్న్‌లతో ఆమెను కోలుకోనీయలేదు. 2006లో 21 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇంత ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్ మరిలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. విజయాలు ఊరికే రావు. అందుకోసం ఎంతో కష్టపడాలి. త్యాగాలకు సిద్ధపడాలి. తినే తిండి మొదలుకొని ప్రతి విషయంలోనూ కఠోర నియమాలు పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యం రోజూ సూర్యుడికన్నా చాలా ముందే మేల్కొని ఆటలో మెలకువలు నేర్చుకోవాలి. లోపాలను గుర్తించాలి. వాటిని పరిహరిస్తున్నామా లేదా అన్న స్పృహ ఉండాలి. ఈ క్రమంలో ఎక్కడా ఏకాగ్రత దెబ్బతినకూడదు. అప్పుడే నిండైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రత్యర్థి ఆట స్థాయిని అధ్యయనం చేసి, వారి అనుకూలతలనూ, ప్రతికూలతలనూ పసిగట్టడం, తాను ఎలాంటి మెల కువలు ప్రదర్శించాలో అంచనా వేసుకోవడం, అందుకు తగిన నైపుణ్యం సాధించడం చిన్న విష యం కాదు. క్రీడారంగం ఒక సమ్మోహన ప్రపంచం. అందులో విజేతగా నిలిచినంతకాలం జనం నీరాజనాలు పడతారు. పతకాలు, రివార్డులు వెదుక్కుంటూ వస్తాయి. ఆర్జన సరేసరి. అదే సమ యంలో ప్రతి అడుగునూ పరిశీలిస్తూ, అదును చిక్కితే∙చాలు...విమర్శించడానికి సిద్ధ పడేవారుంటారు. ‘ఆమె టోర్నీలు చాలా బాగా ఆడుతుంది.కానీ ఫైనల్స్‌కొచ్చేసరికి గెలుపు చిక్కదు’ అని నిట్టూర్చినవారెందరో! నిజమే...ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, సూపర్ సిరీస్, గ్రాండ్ ప్రిక్స్...ఆఖరికి నేషనల్స్‌లో సైతం సింధు ఫైనల్స్ వరకూ రావడం, ఆగిపోవడం రివాజుగా మారింది. మరొకరైతే వీటికి నిరాశ పడేవారు. ఇక విశ్రాంతి తీసుకుందామనుకునేవారు. కానీ అటు కీర్తిప్రతిష్టలనూ, ఇటు విమర్శలనూ సింధు సమంగానే తీసుకుంది. ఇవి తనపై ఏ ప్రభావమూ చూపలేకపోయాయి. తనలో పట్టుదల తగ్గలేదు. ఏకాగ్రత చెదరలేదు. స్వర్ణం సాధించాలన్న స్వప్నం కొడిగట్టలేదు. ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేని 2013లో ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగినప్పుడు చూపిన ఏకాగ్రతనే ఈనాటికీ కొనసాగిస్తూ వచ్చింది. వీటన్నిటి పర్యవసానమే ఆదివారం బాసెల్‌లో చేజిక్కిన విజయం. మన దేశంలో క్రీడలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. చదువు పేరుతో, క్రమశిక్షణ పేరుతో పిల్లలను అదుపాజ్ఞల్లో ఉంచడం ఇంట్లోనూ, బళ్లోనూ కూడా కొనసాగుతోంది. వారు పెరిగి పెద్దయి రెండు చేతలా సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనడమే తప్ప...ఇతరేతర రంగాల్లో, ప్రత్యేకించి క్రీడల్లో తమ పిల్లలు రాణించాలని కోరుకునేవారి సంఖ్య అతి స్వల్పం. విషాదమేమంటే ఈ కొద్దిమందికీ కూడా మన దేశంలో అవకాశాలు తక్కువ. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని సానబెట్టి మెరికల్లా తీర్చిదిద్దాలన్న కాంక్ష ప్రభుత్వాల్లో కలగడం లేదు. వివిధ క్రీడలకున్న సంఘాలకైనా సర్కారీ ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. క్రీడాభివృద్ధి కోసం ప్రపంచ దేశాల్లో అనేకం భారీగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికాలో క్రీడలకు తలసరి రోజుకు రూ. 22, బ్రిటన్ 50 పైసలు ఖర్చు చేస్తుంటే, ఆఖరికి జమైకాలాంటి చిరు దేశం కూడా తలసరి 19 పైసలు కేటాయిస్తుంటే మన దేశంలో మాత్రం కేవలం మూడు పైసలు మాత్రమే వ్యయం చేస్తున్నామని రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ చెప్పారు. ఈ ధోరణి మారాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నిస్తే తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. పిల్లల్ని ఆటలవైపు మళ్లిస్తే ఆరోగ్యపరమైన లాభాలతోపాటు వేర్వేరు క్రీడల్లో ప్రతిభావంతులు రూపుదిద్దుకుంటారు. ఇప్పుడు సింధు సాధించిన బంగారు విజయం అందరికీ స్ఫూర్తిదాయక మవుతుందని ఆశించాలి. -
క్వార్టర్స్‌లో ప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సాయి ప్రణీత్ (భారత్) నిలకడగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో 16వ సీడ్ సాయి ప్రణీత్ 21–19, 21–13తో ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణీత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలతో, స్మాష్ షాట్లతో హోరెత్తించాడు. ఆరంభంలో తడబడినా... జిన్‌టింగ్ మ్యాచ్‌ను ధాటిగా ఆరంభిం చాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న అతను 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వెంటనే తేరుకున్న ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 4–3తో ఆధిక్యంలోకొచ్చాడు. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15–15తో సమానంగా నిలి చారు. కీలక సమయం లో ఒత్తిడిని జయించిన ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 21–17తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్ చేరడం ప్రణీత్‌కిది రెండోసారి. 2018లో కూడా అతను క్వార్టర్స్ చేరాడు. నేడు జరిగే క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్ తలపడతాడు. సింధు అలవోకగా... మహిళల విభాగంలో ఐదో సీడ్ పీవీ సింధు పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన సింధు ప్రత్యర్థికి తన స్మాష్ షాట్లతో ముచ్చెమటలు పట్టించింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో జరిగిన మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21–15, 25–27, 12–21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీకాంత్, ప్రణయ్ ఔట్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం ముగిసింది. గురువారం 46 నిమిషాల పాటు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రణయ్ 19–21, 12–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్‌లో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రణయ్ మ్యాచ్ ఓడినా ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్‌లో ఇరువురు 18–18తో సమంగా ఉన్న సమయంలో... ఆ తర్వాతి పాయింట్ కోసం ఆటగాళ్ల మధ్య ఏకంగా 57 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన ప్రణయ్ తర్వాత గేమ్నూ సమర్పించుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొమోటా సునాయాసంగా గెలిచేశాడు. మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్) చేతిలో చిత్తయ్యాడు. -
సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి!
గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు చుక్కెదురైంది. మహిళల సెమీఫైనల్స్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ నిరాశ పరిచింది. జపాన్ షట్లర్ నొజోమి ఒకుహర చేతిలో పరాజయం పాలైంది. దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్‌లోని దూకుడును మిగిలిన రెండు గేమ్ ల్లో ప్రదర్శించలేక ప్రత్యర్ధికి మ్యాచ్ అప్పగించింది. తొలి గేమ్‌లో 21-12తో విజయం సాధించిన సైనా ఆ తర్వాత కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో రెండో గేమ్ ను 17-21తో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా మరింత నిరాశపరుస్తూ 10-21తో గేమ్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయింది. క్వార్టర్స్ లో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించిన సైనా సెమీస్ లో మాత్రం తడబాటుకు గురై కాంస్యంతో సరిపెట్టుకుంది. మరో సెమీస్ కోసం సిద్ధంగా ఉన్న భారత షట్లర్ పీవీ సింధుపై కూడా ఎన్నో అంచనాలున్నాయి. -
భారత్ కు రెండు పతకాలు ఖాయం
గ్లాస్కో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ లో భారత్ కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు సెమీ ఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖాయం చేసుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ జయకేతనం ఎగురేసి సెమీస్ కు దూసుకెళ్లారు. తొలుత సింధు 21-14, 21-19 తేడాతో చైనా షట్లర్ సన్ యూపై విజయం సాధించి సెమీస్ కు చేరింది. తొలి గేమ్ లో కాస్త శ్రమించిన సింధు.. రెండో గేమ్ లో ఏకపక్ష విజయాన్ని సాధించింది. సన్ యూకు ఏమాత్రం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ప్రధానంగా రెండో గేమ్ లో సింధు దాటికి సన్ యూ తలవంచింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానంలో ఉన్న సింధు అంచనాలను అందుకుంటూ పతకాన్ని ఖాతాలో వేసుకంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధుకు ఇది మూడో పతకం. ఇక మరో క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. -
సైనా అలవోకగా...
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం శ్రీకాంత్, ప్రణయ్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జకార్తా: ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి కచ్చితంగా పతకంతో తిరిగి రావాలని పక్కా ప్రణాళికతో సిద్ధమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ సైనా 21-13, 21-9తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో రెండుసార్లు వరుసగా ఆరేసి పాయింట్లు సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, రెండో గేమ్‌లో చెలరేగి ఒకసారి వరుసగా 10 పాయింట్లు సంపాదించడం విశేషం. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)తో పీవీ సింధు ఆడతారు. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో తకహాషిపై ఆధిక్యంలో ఉండగా... సింధు 1-2తో వెనుకంజలో ఉంది. కశ్యప్‌కు నిరాశ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పదో సీడ్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 11వ సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో సీడ్, ప్రపంచ పదో ర్యాంకర్ కశ్యప్ 21-17, 13-21, 18-21తో ప్రపంచ 34వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-14, 21-15తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21-14, 21-19తో ఎడ్విన్ ఎరికింగ్ (ఉగాండ)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్; యున్ హు (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో తన ప్రత్యర్థిపై శ్రీకాంత్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రణయ్ 0-2తో వెనుకంజలో ఉన్నాడు. జ్వాల-అశ్విని జంట ముందంజ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జ్వాల-అశ్విని ద్వయం రెండో రౌండ్లో 21-10, 21-18తో సెయి పి చెన్-వు తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) జంట 17-21, 19-21తో షిజుకా మత్సో-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జంట 16-21, 12-21తో పీటర్సన్-కోల్డింగ్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేటి మ్యాచ్‌లు ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం