సింధు విజయం స్ఫూర్తిదాయకం | Editorial On World Badminton Champion PV Sindhu | Sakshi
Sakshi News home page

సింధు విజయం స్ఫూర్తిదాయకం

Published Tue, Aug 27 2019 12:35 AM | Last Updated on Tue, Aug 27 2019 12:35 AM

Editorial On World Badminton Champion PV Sindhu - Sakshi

‘విజేతల పతకాలు తయారయ్యేది చెమట, పట్టుదల, సాహసమనే అరుదైన మిశ్రమ లోహంతో’అని అమెరికన్‌ మల్లయోధుడు, ఒకనాటి ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత డాన్‌ గేబుల్‌ అంటాడు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ఆదివారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని ఒడిసిపట్టి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం సింధుకు ఈ మాటలు అక్షరాలా వర్తిస్తాయి. ఇంతక్రితం బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు త్రుటిలో చేజారిన స్వర్ణాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకోసం ఆమె నిర్విరామంగా శ్రమించిన తీరు అత్యద్భుతం. కనుకనే భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా సింధు నమోదైంది.  రెండుసార్లు కాంస్య పతకాలు, మరో రెండుసార్లు రజత పతకాలు గెల్చుకున్నా ఆమె సంతృప్తి పడలేదు. ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా అవతరించిన ఈ క్షణంలో కూడా ఆమె వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌లో సైతం తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అక్కడ సైతం సమున్నత విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది. సింధు చెప్పినట్టు ఈ చరిత్రాత్మక విజయం ఆమె బాధ్యతను మరింత పెంచింది. ఈ ఆట ఆమెపై ఉన్న అంచనాలను అనేక రెట్లు పెంచింది. 

బాసెల్‌లో జరిగిన పోరు వాస్తవానికి ఏకపక్షంగా సాగింది. కేవలం 37 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి ఒకుహరను సింధు మట్టికరిపించింది. రెండేళ్లక్రితం అదే క్రీడాకారిణి తనను ఎదుర్కొన్న తీరు తలుచుకుని ఆద్యంతమూ దూకుడుగా ఆడింది. ఒకుహరకు ఈసారి ఏమాత్రం అవకాశమీయరాదన్న రీతిలో చెలరేగింది. కనుకనే తొలి గేమ్‌ 16 నిమిషాల్లోనే ఆమె వశమైంది. ఆ తర్వాత కూడా సింధు ఎక్కడా తగ్గలేదు. రెండో గేమ్‌లో సైతం ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. సింధు ఆడిన తీరును గమనిస్తే అందులో ఆమె సాధించిన నైపుణ్యం కళ్లకు కడుతుంది. 2017లోనూ అంతే. అప్పుడు ఒకుహర విజయం సాధించి ఉండొచ్చుగానీ, ఆమెను సింధు చివరివరకూ ముప్పుతిప్పలు పెట్టింది. 110 నిమిషాలు సాగిన ఆ మ్యాచ్‌ ప్రపంచ క్రీడాభిమానులందరినీ ఎంతగానో అలరించింది. ఆనాటి చాంపియన్‌కు సింధు ఇప్పుడేమాత్రం అవకాశమీయలేదు. కేవలం 37 నిమిషాల్లోనే అంతా ముగించింది. వరస స్మాష్‌లతో, రిటర్న్‌లతో ఆమెను కోలుకోనీయలేదు. 2006లో 21 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టాక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇంత ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌ మరిలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

విజయాలు ఊరికే రావు. అందుకోసం ఎంతో కష్టపడాలి. త్యాగాలకు సిద్ధపడాలి. తినే తిండి మొదలుకొని ప్రతి విషయంలోనూ కఠోర నియమాలు పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యం రోజూ సూర్యుడికన్నా చాలా ముందే మేల్కొని ఆటలో మెలకువలు నేర్చుకోవాలి. లోపాలను గుర్తించాలి. వాటిని పరిహరిస్తున్నామా లేదా అన్న స్పృహ ఉండాలి. ఈ క్రమంలో ఎక్కడా ఏకాగ్రత దెబ్బతినకూడదు. అప్పుడే నిండైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రత్యర్థి ఆట స్థాయిని అధ్యయనం చేసి, వారి అనుకూలతలనూ, ప్రతికూలతలనూ పసిగట్టడం,  తాను ఎలాంటి మెల కువలు ప్రదర్శించాలో అంచనా వేసుకోవడం, అందుకు తగిన నైపుణ్యం సాధించడం చిన్న విష యం కాదు. క్రీడారంగం ఒక సమ్మోహన ప్రపంచం. అందులో విజేతగా నిలిచినంతకాలం జనం నీరాజనాలు పడతారు. పతకాలు, రివార్డులు వెదుక్కుంటూ వస్తాయి. ఆర్జన సరేసరి. అదే సమ యంలో ప్రతి అడుగునూ పరిశీలిస్తూ, అదును చిక్కితే∙చాలు...విమర్శించడానికి సిద్ధ పడేవారుంటారు.

‘ఆమె టోర్నీలు చాలా బాగా ఆడుతుంది.కానీ ఫైనల్స్‌కొచ్చేసరికి గెలుపు చిక్కదు’ అని నిట్టూర్చినవారెందరో! నిజమే...ఒలింపిక్స్, ఆసియన్‌ గేమ్స్, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్‌ గేమ్స్, సూపర్‌ సిరీస్, గ్రాండ్‌ ప్రిక్స్‌...ఆఖరికి నేషనల్స్‌లో సైతం సింధు ఫైనల్స్‌ వరకూ రావడం, ఆగిపోవడం రివాజుగా మారింది. మరొకరైతే వీటికి నిరాశ పడేవారు. ఇక విశ్రాంతి తీసుకుందామనుకునేవారు. కానీ అటు కీర్తిప్రతిష్టలనూ, ఇటు విమర్శలనూ సింధు సమంగానే తీసుకుంది. ఇవి తనపై ఏ ప్రభావమూ చూపలేకపోయాయి. తనలో పట్టుదల తగ్గలేదు. ఏకాగ్రత చెదరలేదు. స్వర్ణం సాధించాలన్న స్వప్నం కొడిగట్టలేదు. ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేని 2013లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగినప్పుడు చూపిన ఏకాగ్రతనే ఈనాటికీ కొనసాగిస్తూ వచ్చింది. వీటన్నిటి పర్యవసానమే ఆదివారం బాసెల్‌లో చేజిక్కిన విజయం.

మన దేశంలో క్రీడలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. చదువు పేరుతో, క్రమశిక్షణ పేరుతో పిల్లలను అదుపాజ్ఞల్లో ఉంచడం ఇంట్లోనూ, బళ్లోనూ కూడా కొనసాగుతోంది. వారు పెరిగి పెద్దయి రెండు చేతలా సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనడమే తప్ప...ఇతరేతర రంగాల్లో, ప్రత్యేకించి క్రీడల్లో తమ పిల్లలు రాణించాలని కోరుకునేవారి సంఖ్య అతి స్వల్పం. విషాదమేమంటే ఈ కొద్దిమందికీ కూడా మన దేశంలో అవకాశాలు తక్కువ. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని సానబెట్టి మెరికల్లా తీర్చిదిద్దాలన్న కాంక్ష ప్రభుత్వాల్లో కలగడం లేదు. వివిధ క్రీడలకున్న సంఘాలకైనా సర్కారీ ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. క్రీడాభివృద్ధి కోసం ప్రపంచ దేశాల్లో అనేకం భారీగా ఖర్చు చేస్తున్నాయి.

అమెరికాలో క్రీడలకు తలసరి రోజుకు రూ. 22, బ్రిటన్‌ 50 పైసలు ఖర్చు చేస్తుంటే, ఆఖరికి జమైకాలాంటి చిరు దేశం కూడా తలసరి 19 పైసలు కేటాయిస్తుంటే మన దేశంలో మాత్రం కేవలం మూడు పైసలు మాత్రమే వ్యయం చేస్తున్నామని రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ చెప్పారు. ఈ ధోరణి మారాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నిస్తే తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. పిల్లల్ని ఆటలవైపు మళ్లిస్తే ఆరోగ్యపరమైన లాభాలతోపాటు వేర్వేరు క్రీడల్లో ప్రతిభావంతులు రూపుదిద్దుకుంటారు. ఇప్పుడు సింధు సాధించిన బంగారు విజయం అందరికీ స్ఫూర్తిదాయక మవుతుందని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement