భారత్ కు రెండు పతకాలు ఖాయం
గ్లాస్కో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ లో భారత్ కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు సెమీ ఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖాయం చేసుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరూ జయకేతనం ఎగురేసి సెమీస్ కు దూసుకెళ్లారు. తొలుత సింధు 21-14, 21-19 తేడాతో చైనా షట్లర్ సన్ యూపై విజయం సాధించి సెమీస్ కు చేరింది.
తొలి గేమ్ లో కాస్త శ్రమించిన సింధు.. రెండో గేమ్ లో ఏకపక్ష విజయాన్ని సాధించింది. సన్ యూకు ఏమాత్రం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ప్రధానంగా రెండో గేమ్ లో సింధు దాటికి సన్ యూ తలవంచింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానంలో ఉన్న సింధు అంచనాలను అందుకుంటూ పతకాన్ని ఖాతాలో వేసుకంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధుకు ఇది మూడో పతకం. ఇక మరో క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.