కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్‌లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.
ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్‌లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment