సైనా అలవోకగా...
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
శ్రీకాంత్, ప్రణయ్ కూడా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
జకార్తా: ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి కచ్చితంగా పతకంతో తిరిగి రావాలని పక్కా ప్రణాళికతో సిద్ధమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండో సీడ్ సైనా 21-13, 21-9తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో రెండుసార్లు వరుసగా ఆరేసి పాయింట్లు సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, రెండో గేమ్‌లో చెలరేగి ఒకసారి వరుసగా 10 పాయింట్లు సంపాదించడం విశేషం. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)తో పీవీ సింధు ఆడతారు. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో తకహాషిపై ఆధిక్యంలో ఉండగా... సింధు 1-2తో వెనుకంజలో ఉంది.
కశ్యప్‌కు నిరాశ
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పదో సీడ్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 11వ సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో పదో సీడ్, ప్రపంచ పదో ర్యాంకర్ కశ్యప్ 21-17, 13-21, 18-21తో ప్రపంచ 34వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-14, 21-15తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21-14, 21-19తో ఎడ్విన్ ఎరికింగ్ (ఉగాండ)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో ప్రణయ్; యున్ హు (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో తన ప్రత్యర్థిపై శ్రీకాంత్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రణయ్ 0-2తో వెనుకంజలో ఉన్నాడు.
జ్వాల-అశ్విని జంట ముందంజ
మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జ్వాల-అశ్విని ద్వయం రెండో రౌండ్‌లో 21-10, 21-18తో సెయి పి చెన్-వు తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) జంట 17-21, 19-21తో షిజుకా మత్సో-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జంట 16-21, 12-21తో పీటర్సన్-కోల్డింగ్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
నేటి మ్యాచ్‌లు
ఉదయం గం. 9.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం