ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌పై విజయం
తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.
సినెర్, డ్రేపర్ తొలిసారి...
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు.
కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్‌స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు.
ఏడో ప్రయత్నంలో...
కెరీర్‌లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది.
88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు.
ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment