నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గిమ్‌చియోన్ (కొరియా): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... ఈసారి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో భారత ఆశలన్నీ పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లపైనే ఆధారపడి ఉన్నాయి.
తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీల తర్వాత బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో చెయుంగ్ ఎన్‌గాన్ యి (హాంకాంగ్)తో సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో గో సూన్ హువాట్ (మలేసియా)తో కశ్యప్ తలపడతారు.
స్థాయికి తగ్గట్టు ఆడితే కశ్యప్ సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కశ్యప్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో శ్రీకాంత్; ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్ ఆడతారు. ‘రెండేళ్ల క్రితం చివరిసారి లిన్ డాన్‌తో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడాను.
లిన్ డాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అతనితో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతాను. గెలిచేందుకు నా వందశాతం కృషి చేస్తాను. సింగపూర్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన మ్యాచ్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
అన్ని విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. 1991లో మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలను గెల్చుకున్నారు.