qualifying competition
-
అన్నింటికంటే ‘మిక్స్డ్’ ముందు!
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్‌లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గేమ్ ఫార్మాట్‌ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్‌మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్‌లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్‌తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో మిక్స్డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్‌లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది. -
హామిల్టన్‌కు 87వ ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ): ఈ సీజన్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.767 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఈ సీజన్లో పది రేసులు జరగ్గా... ఏడింటిలో హామిల్టనే విజేత. మరో రెండు రేసుల్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నెగ్గగా... మరోదాంట్లో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి క్వాలిఫయింగ్ సెషన్‌ను దాటలేకపోయాడు. ఆదివారం జరిగే రేసును అతను చివరిదైన 20వ స్థానం నుంచి మొదలు పెడతాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. పియరీ గాస్లీ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (అల్ఫా రోమియో), 6. గ్రోస్యెన్ (హాస్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 10. లెక్లెర్క్ (ఫెరారీ), 11. గియోవినాజి (అల్ఫా రోమియో), 12. మాగ్నుసెన్ (హాస్), 13. రికియార్డో (రెనౌ), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 16. లాండో నోరిస్ (మెక్లారెన్), 17. అలెగ్జాండర్ ఆల్బోన్ (ఎస్టీఆర్), 18. జార్జి రసెల్ (విలియమ్స్), 19. రాబర్ట్ కుబికా (విలియమ్స్), 20. వెటెల్ (ఫెరారీ). సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గిమ్‌చియోన్ (కొరియా): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... ఈసారి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో భారత ఆశలన్నీ పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీల తర్వాత బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గో సూన్ హువాట్ (మలేసియా)తో కశ్యప్ తలపడతారు. స్థాయికి తగ్గట్టు ఆడితే కశ్యప్ సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కశ్యప్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో శ్రీకాంత్; ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్ ఆడతారు. ‘రెండేళ్ల క్రితం చివరిసారి లిన్ డాన్‌తో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడాను. లిన్ డాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అతనితో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతాను. గెలిచేందుకు నా వందశాతం కృషి చేస్తాను. సింగపూర్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన మ్యాచ్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. అన్ని విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. 1991లో మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలను గెల్చుకున్నారు.