![US Open mixed doubles prize money increased by another one million dollars](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/us%20open_2.jpg.webp?itok=pbGyrCqN)
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకుల నిర్ణయం
క్వాలిఫయింగ్ టోర్నీతో పాటే నిర్వహణ
మిక్స్‌డ్ డబుల్స్ ప్రైజ్‌మనీ మరో 10 లక్షల డాలర్లు పెంపు
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్‌డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్‌డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్‌లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
గేమ్ ఫార్మాట్‌ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్‌డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్‌మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్‌లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్‌డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్‌డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి.
మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్‌తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్‌లో మిక్స్‌డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు.
కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్‌డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్‌లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment