
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, ప్రణయ్
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 20–22, 24–22, 21–16తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెజ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
తొలి గేమ్ కోల్పోయిన రుత్విక–రోహన్ రెండో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని గట్టెక్కారు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్విక–రోహన్ చివరివరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ఆయుశ్ షెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్, సతీశ్ కుమార్ కరుణాకరన్ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. శ్రీకాంత్ 21–19, 21–14తో కూ తకహాషి (జపాన్)పై, ప్రణయ్ 21–11, 20–22, 21–9తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై, ఆయుశ్ 21–17, 21–9తో ప్రపంచ మాజీ చాంపియన్ కీ యె లో (సింగపూర్)పై గెలిచారు.
కిరణ్ జార్జి 21–15, 16–21, 10–21తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో, ప్రియాన్షు 17–21, 7–21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత ప్లేయర్లు ఉన్నతి హుడా 9–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో... ఇషారాణి బారువా 13–21, 13–21తో అసుక తకహాషి (జపాన్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment