ruthvika shivani
-
చాంపియన్ రుత్విక–రోహన్
రాయ్‌పూర్: సీఎం ట్రోఫీ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ గెలిచింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట అదరగొట్టింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలో దక్కడం విశేషం. గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ ఐదు విభాగాల్లో భారత ఆటగాళ్లకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు లభించాయి. తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌గా నిలిచిన రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట... తాజా టోర్నీ ఫైనల్లో ఆదివారం 21–16, 19–21, 21–12తో టాప్ సీడ్ అమృత ప్రముథేశ్–అశిత్ సూర్య ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ టైటిల్ రక్షిత శ్రీ సంతోష్ రామ్రాజ్ కైవసం చేసుకుంది. తుదిపోరులో రక్షిత 17–21, 21–12, 21–12తో క్వాలిఫయర్ తన్వి పత్రిపై గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయిన రక్షిత ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో విజృంభించి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి విజేతగా నిలిచింది. గత వారం హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రక్షిత ఈ సారి టైటిల్ చేజిక్కించుకుంటే... 13 ఏళ్ల తన్వి పత్రి ఆడిన తొలి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రన్నరప్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ మిథున్ మంజునాథ్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో మిథున్ 13–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రాహుల్ భరద్వాజ్ గాయంతో తప్పుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో హరిహరణ్ అంసాకరుణన్–రూబన్ కుమార్ జంట 21–15–21–16తో డింకూ సింగ్–అమాన్ మొహమ్మద్ ద్వయంపై గెలుపొందింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్–వర్షిణి విశ్వనాథ్ శ్రీ జోడీ 21–18, 21–19తో కావ్య గుప్తా–రాధిక శర్మ జంటపై గెలుపొందింది. -
రుత్విక–రోహన్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ సాధించింది. గచ్చిబౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు దక్కడం విశేషం. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–17, 21–19తో హరిహరన్–తనీషా క్రాస్టో (భారత్) జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్ టైటిల్ ఇషారాణి బారువా (భారత్)కు లభించింది. ఫైనల్లో ఇషారాణి 21–15, 9–21, 21–17తో రక్షిత శ్రీ (భారత్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో తరుణ్ రెడ్డి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రిత్విక్ సంజీవి చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ 19–21, 17–21తో పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రియా కొంజెంగ్‌బమ్–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 21–18, 21–13తో ఆరతి సారా సునీల్–వర్షిణి (భారత్) జోడీపై గెలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక–రోహన్ కపూర్ (భారత్) జోడీ 22–20, 21–17తో కెన్నెత్–గ్రోన్యా సోమర్విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ లో జాతీయ చాంపియన్ అన్మోల్ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
రుత్విక శివాని ఖాతాలో మిక్స్డ్ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి రుత్విక శివాని మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. బెంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన రుత్విక (తెలంగాణ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రుత్విక–రోహన్ ద్వయం 21–12, 21–16తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)–త్రిషా హెగ్డే (కర్ణాటక) జోడీపై నెగ్గింది. టైటిల్ గెలిచే క్రమంలో రుతి్వక–రోహన్ తమ ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. -
సెమీస్‌లో రుత్విక శివాని
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుత్విక 21–19, 21–9తో టాప్ సీడ్ ఐరా శర్మను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మాన్సి సింగ్‌తో రుత్విక ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో మాన్సి 21–13, 21–15తో హైదరాబాద్ ప్లేయర్ మేఘన రెడ్డిపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్; షేక్ గౌస్–మనీషా జోడీలు సెమీఫైనల్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి–రోహన్ ద్వయం 21–13, 21–17తో నితిన్–పూర్వీషా రామ్ జోడీపై... షేక్ గౌస్–మనీషా జంట 21–7, 21–17తో నజీర్ ఖాన్–నీలా వలువన్ జోడీపై విజయం సాధించాయి. -
విజేత రుత్విక శివాని
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో క్వాలిఫయర్ రుత్విక 21–10, 21–17తో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాలబారిన పడ్డ రుత్విక ఇటీవలే కోలుకొని పునరాగమనం చేసింది. మహిళల డబుల్స్‌లో బండి సాహితి (తెలంగాణ)–నీల (తమిళనాడు) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాహితి–నీల జోడీ 12–21, 17–21తో టాప్ సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయింది. -
విజేత రుత్విక శివాని
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రుత్విక 21–12, 23–21తో రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల రుత్విక రెండో గేమ్‌లో ఒకదశలో 17–20తో మూడు గేమ్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచిన రుత్విక 20–20తో స్కోరును సమం చేసింది. అనంతరం ఇద్దరూ చెరో పాయింట్ గెలవడంతో స్కోరు 21–21తో సమమైంది. ఈ దశలో రుత్విక వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. టాటా ఓపెన్‌ను రుత్విక నెగ్గడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ఆమె ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 14–21, 19–21తో సితికామ్ థమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
మెయిన్ ‘డ్రా’కు రుత్విక
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రుత్విక అజేయంగా నిలిచింది. తొలి రౌండ్లో రుత్విక 21-9, 21-16తో మరో తెలుగమ్మాయి గుమ్మడి వృశాలిని ఓడించగా... రెండో రౌండ్లో 21-16, 21-18తో గ్రేస్ గేబ్రియల్ (నైజిరియా)పై గెలిచింది. రుత్వికతోపాటు భారత్‌కే చెందిన తన్వీ లాడ్, రితూపర్ణ దాస్, అరుణ ప్రభుదేశాయ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి సౌరభ్ వర్మ ఒక్కడే మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. -
సింగిల్స్ విజేత రుత్విక
సాక్షి, హైదరాబాద్: రాధేశ్యామ్ గుప్తా స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువతార గద్దె రుత్విక శివాని సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ రుత్విక 21-10, 21-18తో నాలుగో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై గెలిచింది. -
సింగిల్స్ చాంప్ రుత్విక
చండీగఢ్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు సత్తా చాటుకున్నారు. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని... అండర్-19 సింగిల్స్‌లో రీతూపర్ణ దాస్ విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలికల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి మేఘన సహచరిణి రీతూపర్ణ దాస్‌తో కలిసి... అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియా ఆటగాడు సాన్యామ్ శుక్లాతో జతగా టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అండర్-17 ఫైనల్లో రెండో సీడ్ రుత్విక 21-19, 21-14తో కరిష్మా వాద్కర్ (మహారాష్ట్ర)ను ఓడించింది. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రుత్వికకు ‘డబుల్’ సాధించే అవకాశం చేజారింది. అండర్-19 సింగిల్స్ ఫైనల్లో రుత్విక 14-21, 7-21తో టాప్ సీడ్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రీతూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. బెంగాల్‌కు చెందిన రీతూపర్ణ దాస్ హైదరాబాద్‌లోని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. అండర్-19 బాలికల డబుల్స్ ఫైనల్లో మేఘన-రీతూపర్ణ దాస్ ద్వయం 17-21, 21-9, 21-12తో వైష్ణవి అయ్యర్ (మహారాష్ట్ర)-రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) జోడిపై గెలిచింది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 21-11, 22-24, 21-7తో సంకీర్త్-మీరా మహాదేవన్ (కర్ణాటక) జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.