
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుత్విక 21–19, 21–9తో టాప్ సీడ్ ఐరా శర్మను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మాన్సి సింగ్‌తో రుత్విక ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో మాన్సి 21–13, 21–15తో హైదరాబాద్ ప్లేయర్ మేఘన రెడ్డిపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్; షేక్ గౌస్–మనీషా జోడీలు సెమీఫైనల్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి–రోహన్ ద్వయం 21–13, 21–17తో నితిన్–పూర్వీషా రామ్ జోడీపై... షేక్ గౌస్–మనీషా జంట 21–7, 21–17తో నజీర్ ఖాన్–నీలా వలువన్ జోడీపై విజయం సాధించాయి.