సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ సాధించింది. గచ్చిబౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు దక్కడం విశేషం.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–17, 21–19తో హరిహరన్–తనీషా క్రాస్టో (భారత్) జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్ టైటిల్ ఇషారాణి బారువా (భారత్)కు లభించింది. ఫైనల్లో ఇషారాణి 21–15, 9–21, 21–17తో రక్షిత శ్రీ (భారత్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో తరుణ్ రెడ్డి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రిత్విక్ సంజీవి చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ 19–21, 17–21తో పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రియా కొంజెంగ్‌బమ్–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 21–18, 21–13తో ఆరతి సారా సునీల్–వర్షిణి (భారత్) జోడీపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment