మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రియాంశికి నిరాశ
బెంగళూరు: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) ద్వయం 17–21, 18–21తో ఆయుశ్ అగర్వాల్–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంట చేతిలో ఓడిపోయింది.
మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన శ్రియాంశి వలిశెట్టి కూడా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రియాంశి 15–21, 16–21తో దేవిక సిహాగ్ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎం.రఘు (కర్ణాటక) 14–21, 21–14, 24–22తో మిథున్ మంజునాథ్ (రైల్వేస్)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో రఘు ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం.
మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జోడీ 21–18, 20–22, 21–17తో ప్రియా దేవి (మణిపూర్)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అర్‡్ష మొహమ్మద్ (ఉత్తరప్రదేశ్)–సంస్కార్ సరస్వత్ (రాజస్తాన్) ద్వయం 12–21, 21–12, 21–19తో టాప్ సీడ్ నవీన్–లోకేశ్ (తమిళనాడు) జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment