ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రుత్విక 21–12, 23–21తో రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల రుత్విక రెండో గేమ్‌లో ఒకదశలో 17–20తో మూడు గేమ్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచిన రుత్విక 20–20తో స్కోరును సమం చేసింది.
అనంతరం ఇద్దరూ చెరో పాయింట్ గెలవడంతో స్కోరు 21–21తో సమమైంది. ఈ దశలో రుత్విక వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. టాటా ఓపెన్‌ను రుత్విక నెగ్గడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ఆమె ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 14–21, 19–21తో సితికామ్ థమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment