‘లిరెన్ 55వ ఎత్తు తర్వాత నేను ఏం వేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడమే తరువాయి. అయితే ఒక్కసారిగా అతని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దానిని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది.
ఆరేళ్ల వయసులో చెస్ మొదలు పెట్టాను. గత పదేళ్లుగా ఇదే కల నన్ను నడిపించింది. ప్రతీ ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్, కార్ల్‌సన్ మధ్య పోరును చెన్నైలోని ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు.
దాంతో గాజు తెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండా పక్కన పెట్టుకొని పోటీ పడటం గర్వంగా అనిపించింది. కార్ల్‌సన్ టైటిల్ సాధించిన సమయంలో దానిని మళ్లీ భారత్‌కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా.
అధికారికంగా నా టీమ్‌లో ఆనంద్ సర్ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది.
గత ఏడాది నేను క్యాండిడేట్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్ గెలవగానే అమ్మకు ఫోన్ చేశాను. ఇద్దరమూ ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.
చెస్‌ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్‌ల వరకు కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్ సూచనలు నన్ను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాతి రెండు గేమ్‌లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు.
కార్ల్‌సన్ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకూ ఉంది. చెస్‌లో అదే అత్యంత పెద్ద సవాల్. అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది. అతడిని స్ఫూర్తిగా తీసుకొనే అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నా’ అని విజయనంతరం మీడియా సమావేశంలో గుకేశ్ పేర్కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment