ముంబై చేతిలో హంటర్స్‌కు షాక్
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో ముంబై రాకెట్స్ జోరుకు హైదరాబాద్ హంటర్స్ తలవంచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాకెట్స్ 2–1తో హంటర్స్‌పై విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో కరోలినా మారిన్ పరాజయం హంటర్స్‌ను నిరాశపరిచింది. మొదట పురుషుల డబుల్స్‌లో లి యోంగ్ డే–నిపిత్ఫోన్ ఫుంగ్‌ఫపెట్ (ముంబై) జోడి 11–9, 11–5తో తన్ బూన్ హ్యంగ్–తన్ వీ కియోంగ్ (హైదరాబాద్) జంటపై గెలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో మారిన్ (హైదరాబాద్) 7–11, 11–7, 12–14తో జీ హ్యూన్ సంగ్ (ముంబై) చేతిలో ఓడింది.
పురుషుల సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 11–7, 11–8తో అజయ్ జయరామ్ (ముంబై)పై గెలిచాడు. అనంతరం ముంబై తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా బరిలోకి దిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడింది. సాత్విక్ సాయిరాజ్–చౌ హో వా (హైదరాబాద్) జంట 11–13, 12–10, 15–14తో లీయోంగ్ డే– జియెబా (ముంబై) జోడిపై నెగ్గింది. చివరగా జరిగిన హైదరాబాద్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ప్రణయ్ (ముంబై) 11–6, 11–7తో సమీర్ వర్మ (హైదరాబాద్)ను ఓడించడంతో ముంబై 2–1తో గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో ఢిల్లీ ఏసర్స్ తలపడుతుంది.