‘షటిల్‌’ సంబరం | PBL matches in Hyderabad from today | Sakshi
Sakshi News home page

‘షటిల్‌’ సంబరం

Published Wed, Jan 10 2018 1:15 AM | Last Updated on Wed, Jan 10 2018 1:15 AM

PBL matches in Hyderabad from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ అభిమానులను గత కొద్ది రోజులుగా అలరిస్తూ వచ్చిన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) చివరి అంచెకు చేరుకుంది. లీగ్‌ దశలో ఆఖరి రెండు మ్యాచ్‌లు నేడు, రేపు హైదరాబాద్‌లో జరగనున్నాయి. దాంతో పాటు నాకౌట్‌ మ్యాచ్‌లకు కూడా నగరమే వేదిక కానుంది. రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు జనవరి 14న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. షటిల్‌కు ఇప్పటికే అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో పీబీఎల్‌ గత రెండు సీజన్లలో జరిగిన మ్యాచ్‌లకు కూడా మంచి స్పందన లభించింది. ఇప్పుడు కూడా పండగ సమయంలో బ్యాడ్మింటన్‌ అభిమానుల సంబరానికి మరో అవకాశం లభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే లోకల్‌ టీమ్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ దాదాపుగా సెమీస్‌ స్థానం ఖాయం చేసుకోవడంతో హైదరాబాద్‌ అంచె మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ తలపడుతుంది.

ఢిల్లీ జట్టులో మహిళల సింగిల్స్‌ ప్రపంచ మూడో ర్యాంకర్‌ సుంగ్‌ జీ హున్‌ (కొరియా)... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ తియాన్‌ హువీ (చైనా)... నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ జట్టులో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్‌ వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ)... ప్రపంచ 20వ ర్యాంకర్‌ అజయ్‌ జయరామ్‌ (భారత్‌)... బెంగళూరు బ్లాస్టర్స్‌ తరఫున పురుషుల సింగిల్స్‌ ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌... మహిళల డబుల్స్‌లో స్థానిక క్రీడాకారిణి సిక్కి రెడ్డి  ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. డిసెంబర్‌ 23 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గువాహటి, ఢిల్లీ, లక్నో, చెన్నై నగరాలు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు వేదికలుగా నిలిచాయి.  bookmyshowలో ఆన్‌లైన్‌ ద్వారా లేదా మ్యాచ్‌ రోజుల్లో గచ్చిబౌలి స్టేడియం వద్ద కౌంటర్లలో కూడా టికెట్లు లభిస్తాయి. లీగ్‌ మ్యాచ్‌లకు రూ.500గా టికెట్‌ ధర నిర్ణయించగా... సెమీస్‌ కోసం రూ.700, ఫైనల్‌కు రూ.900కు టికెట్లు లభిస్తాయి.

హైదరాబాద్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌
అన్ని మ్యాచ్‌లు రా.గం. 7.00 నుంచి
జనవరి 10    :    ఢిల్లీ డాషర్స్‌ గీ  నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌  
జనవరి 11    :    హైదరాబాద్‌ హంటర్స్‌ గీ 
బెంగళూరు బ్లాస్టర్స్‌  
జనవరి 12    :    తొలి సెమీఫైనల్‌ 
జనవరి 13    :    రెండో సెమీఫైనల్‌  
జనవరి 14    :    ఫైనల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement