వారెవ్వా హంటర్స్‌ | Carolina Marin Stars as Hyderabad Hunters Reach the Final | Sakshi
Sakshi News home page

వారెవ్వా హంటర్స్‌

Published Sat, Jan 13 2018 12:48 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

Carolina Marin Stars as Hyderabad Hunters Reach the Final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ జైత్రయాత్ర కొనసాగింది. తొలిసారి ఈ లీగ్‌లో సెమీస్‌ చేరిన హంటర్స్‌ అదే ఊపులో ఫైనల్లోకీ అడుగు పెట్టింది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌ 3–0తో ఢిల్లీ డాషర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హైదరాబాద్‌ జోడి ఓడినా... తర్వాతి రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లలో హంటర్స్‌ జయకేతనం ఎగురవేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డాషర్స్‌ జంట అశ్విని పొన్నప్ప–ఇవనోవ్‌ 13–15, 15–10, 15–10 తేడాతో పియా జెబాదియా–సాత్విక్‌ సాయిరాజ్‌ను ఓడించి 1–0తో ముందంజ వేసింది. అయితే తర్వాత జరిగిన తొలి పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌ 15–9, 15–8 పాయింట్ల తేడాతో తియాన్‌ హోవీని చిత్తు చేశాడు. ఇది ఢిల్లీకి ట్రంప్‌ మ్యాచ్‌ కావడంతో ఆ జట్టు పాయింట్‌ కోల్పోయింది. ఫలితంగా స్కోరు 1–0తో హైదరాబాద్‌ పక్షాన నిలిచింది.

అనంతరం మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో హైదరాబాద్‌ను గెలిపించింది. ఈ హంటర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌లో మారిన్‌ 12–15, 15–10, 15–9తో సుంగ్‌ జీ హున్‌పై విజయం సాధించింది. దాంతో రెండు పాయింట్లు సొంతం చేసుకొని హైదరాబాద్‌ 3–0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ గెలిచినా రెండు పాయింట్లే సాధించే అవకాశం ఉండటంతో తుది ఫలితం తేలిపోయింది. ఇది నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో తర్వాతి రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. నేడు రాత్రి 7 గంటల నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ తలపడుతుంది. లీగ్‌ దశలో ఒకరితో మరొకరు తలపడే అవకాశం రాని ఈ రెండు జట్లలో పురుషుల, మహిళల వరల్డ్‌ నంబర్‌వన్‌ షట్లర్లు ఉండటం విశేషం.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement