
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో హైదరాబాద్ హంటర్స్ తమ చివరి మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌ను తుడిచిపెట్టేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పోరులో హంటర్స్ 6–(–1) తో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో పియా జెబదియా – సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడి 15–6, 14–15, 15–9తో సిక్కి రెడ్డి– మను అత్రి (బెంగళూరు)జంటపై గెలిచి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 10–15, 15–7, 15–14తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు)పై, మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ 15–9, 15–7తో కిర్‌స్టీ గిల్మోర్ (బెంగళూరు)పై గెలుపొందారు.
తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లీ హ్యూన్ ఇల్ 15–11, 11–15, 15–11తో శుభాంకర్ డే (బెంగళూరు)పై విజయం సాధించడంతో మరో మ్యాచ్ ఉండగానే హైదరాబాద్ 5–0తో జయభేరి మోగించింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్ బెంగళూరుకు ‘ట్రంప్’ కాగా... మార్కిస్ కిడో–సియాంగ్ (హైదరాబాద్) జోడి 15–10, 11–15, 15–7తో కిమ్ స రంగ్–మథియాస్ బోయె (బెంగళూరు) జంటపై గెలిచింది. నేటి రాత్రి 7 గంటలకు జరిగే సెమీస్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment