పీబీఎల్-2 వేలం నేడు
అందరి దృష్టి సింధు, మారిన్, సైనాలపైనే
బరిలో 16 మంది ఒలింపిక్ పతక విజేతలు
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌కు సన్నాహాలు మొదలయయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరిగే ఈ లీగ్‌కు సంబంధించి క్రీడాకారుల వేలం బుధవారం జరగనుంది.
రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... రజత పతక విజేత పీవీ సింధు (భారత్), మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ (భారత్)తోపాటు రియో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) వేలంపాటలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. అన్ని విభాగాల్లో కలిపి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వేలంపాటలో ఉన్నారు. ఒక్కో జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకోవడానికి వెసులుబాటు ఉంది.
రెండు వారాలపాటు జరిగే ఈ లీగ్ ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లు కావడం విశేషం. మొత్తం ఆరు జట్లు ఢిల్లీ ఏసర్స్, ముంబై రాకెట్స్, చెన్నై స్మాషర్స్, హైదరాబాద్ హంటర్స్, అవధ్ వారియర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ టైటిల్ కోసం తలపడతాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పీబీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. పీవీ సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు, సైనా అవధ్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.