సాయి ప్రణీత్ సంచలనం
♦ హైదరాబాద్‌పై లక్నో విజయం
♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సొంతగడ్డపై మ్యాచ్‌లను హైదరాబాద్ హంటర్స్ ఓటమితో ప్రారంభించింది. శనివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో అవధ్ వారియర్స్ 4-3 తేడాతో హైదరాబాద్ హంటర్స్‌పై విజయం సాధించింది. గోపీచంద్ అకాడమీ సహచరుల మధ్య జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్... పారుపల్లి కశ్యప్‌ను చిత్తు చేయడం విశేషం. గాయంతో మరోసారి సైనా నెహ్వాల్ మ్యాచ్ ఆడకుండా తప్పుకుంది.
కశ్యప్‌కు నిరాశ: సైనా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆడిన జి.వృషాలి 15-7, 15-11 స్కోరుతో కె.సుపనిదను చిత్తు చేసి అవధ్‌కు 1-0 ఆధిక్యం అందించింది. పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడి బోడిన్ ఇసారా-కై యున్ 15-10, 15-12తో హంటర్స్ జంట కార్స్‌టెన్ మోగెన్సన్-మార్కిస్ కిడోను ఓడించింది. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు ఖాతాలో అదనపు పాయింట్ చేరింది. దీంతో వారియర్స్ 3-0 ఆధిక్యంలోకి వచ్చారు. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 6-15, 15-8, 15-5తో కశ్యప్‌ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆరంభంలో కశ్యప్ ఆధిక్యం కనబర్చాడు.
అయితే రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న సాయి కోలుకున్నాడు. కశ్యప్ డ్రాప్ షాట్‌లు వరుసగా విఫలం కావడం సాయికి కలిసొచ్చి సమంగా నిలిచాడు. మూడో గేమ్‌లో కూడా ప్రణీత్ జోరు కొనసాగింది. అద్భుతమైన స్మాష్‌లతో దూకుడు ప్రదర్శించిన అతను కశ్యప్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరకు కూడా మరో చక్కటి స్మాష్‌తో అవధ్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ ముగిసేసరికి 4-0తో లక్నో స్పష్టమైన ఆధిక్యంతో మ్యాచ్ సొంతం చేసుకుంది.
రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ లీ చోంగ్ వీ 15-8, 15-9తో తనోంగ్‌సక్‌పై గెలుపొందాడు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లీ చోంగ్ వీ ఈసారి స్థాయికి తగ్గట్లుగా ఆడాడు. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఇక చివరిగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో హంటర్స్ ద్వయం జ్వాల గుత్తా-మార్కిస్ కిడో 12-15, 15-14, 15-10తో బోడిన్ ఇసారా-క్రిస్టియానాను ఓడించి లక్నో ఆధిక్యాన్ని 4-3కు తగ్గించింది.