సైనా నెహ్వాల్
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్‌లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్‌కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్‌తో సైనా తలపడతారు.
సమీర్ వర్మ ముందంజ...
పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్‌పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు.
సిక్కి–అశ్విని జంట జోరు...
మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment