బ్యాడ్మింటన్‌ బ్రహ్మోత్సవం | Premier Badminton League starts tomorrow | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ బ్రహ్మోత్సవం

Published Fri, Dec 30 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

బ్యాడ్మింటన్‌ బ్రహ్మోత్సవం

బ్యాడ్మింటన్‌ బ్రహ్మోత్సవం

రేపటి నుంచి పీబీఎల్‌–2 
బరిలో 6 జట్లు  
మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లు 
తొలి రోజే మారిన్‌తో సింధు ‘ఢీ’   


బ్యాడ్మింటన్‌లో మళ్లీ వినోదాల పండగొచ్చింది. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో షటిల్‌పై ఉవ్వెత్తున ఎగసిన అభిమానానికి తోడుగా వేర్వేరు వేదికల్లో భారత ఆటగాళ్లు సాధించిన వరుస విజయాలు మరింత ఊపునిచ్చాయి. దాంతో సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మరోసారి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సన్నద్ధమైంది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతున్న సీజన్‌–2 పీబీఎల్‌తో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రెండు వారాల పాటు ‘బ్యాడీస్‌’ వినోదం అందించడం ఖాయం. ఇక సింధు, మారిన్‌ మధ్య జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులకు ఇప్పుడు వారిద్దరి ప్రత్యక్ష పోరును తిలకించే అవకాశం టోర్నీ తొలి రోజే వచ్చింది. హైదరాబాద్‌లో రెండు రోజుల ‘షో’ తర్వాత మరో నాలుగు నగరాలు ముంబై, లక్నో, బెంగళూరు, న్యూఢిల్లీలలో పీబీఎల్‌  సందడి చేయనుంది.  

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) రెండో అంచె పోటీలకు రంగం సిద్ధమైంది. రేపు (ఆదివారం) నగరంలోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం తొలి రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 14 వరకు జరిగే ఈ టోర్నీలో ఫైనల్‌ను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టాప్‌ షట్లర్లతో పాటు ప్రపంచంలో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో సింధు చెన్నై స్మాషర్స్‌కు... సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ అవధ్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రియో ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. మొత్తం 6 జట్లు తలపడుతుండగా, ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి. 2016 జనవరిలో జరిగిన గత పీబీఎల్‌లో ఢిల్లీ ఏసర్స్‌ విజేతగా నిలిచింది. అనివార్య కారణాలతో ఈసారి చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించారు.

మారిన ఫార్మాట్‌...
టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య జరిగే ఒక ‘టై’లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల విభాగంలో రెండు సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లలో ఆటగాళ్లు తలపడతారు. గత ఏడాది మూడు గేమ్‌ల పోరులో మూడో గేమ్‌ మాత్రమే 11 పాయింట్లుగా ఉంది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 11 పాయింట్ల పద్ధతిని పీబీఎల్‌లో వాడుతున్నారు. ప్రసారకర్తల పరిమితుల వల్ల కూడా ఈసారి మూడు గేమ్‌లను కూడా 11 పాయింట్లతోనే నిర్వహిస్తారు. విజేతను తేల్చేందుకు చివర్లో ప్రత్యర్థుల మధ్య కనీసం 2 పాయింట్ల తేడా ఉండాలి. అది 14–14 వరకు సాగుతుంది. అప్పుడు మాత్రం ‘సడెన్‌ డెత్‌’గా ముందు ఎవరు స్కోర్‌ చేస్తే వారిదే గేమ్‌ అవుతుంది.

వేలంలో మారిన్‌ టాపర్‌...
ఈ టోర్నీ కోసం నవంబర్‌లో వేలం నిర్వహించారు. అందులో అత్యధికంగా రూ. 61.5 లక్షల మొత్తానికి కరోలినా మారిన్‌ను హైదరాబాద్‌ జట్టు సొంతం చేసుకుంది. సుంగ్‌ జీ హున్‌ (ముంబై)కి రూ. 60 లక్షలు దక్కాయి. శ్రీకాంత్‌ (రూ. 51 లక్షలు), సింధు (రూ. 39 లక్షలు), సైనా నెహ్వాల్‌ (రూ. 33 లక్షలు) ఎక్కువ మొత్తం పొందిన భారత షట్లర్లుగా నిలిచారు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకుంటున్న మారిన్, సైనా అంచనాలకు అనుగుణంగా తమ పూర్తి సత్తాను ప్రదర్శించగలరా చూడాలి.

భారీ ప్రైజ్‌మనీ...
పీబీఎల్‌లో మొత్తం ప్రైజ్‌మనీని రూ. 6 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 కోట్లు లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీస్‌ చేరిన రెండు జట్లకు చెరో రూ. 75 లక్షల చొప్పున అందజేస్తారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో పలు సంస్థలు పీబీఎల్‌తో జత కట్టడానికి ఆసక్తి చూపించడం బ్యాడ్మింటన్‌కు పెరిగిన ఆదరణను చూపిస్తుంది. పలు కార్పొరేట్‌ సంస్థలు టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ‘బెంగళూరు బ్లాస్టర్స్‌’ జట్టును సొంతం చేసుకొని తొలిసారి ఈ లీగ్‌లోకి అడుగు పెట్టడం విశేషం.

జట్ల వివరాలు
హైదరాబాద్‌ హంటర్స్‌: కరోలినా మారిన్, రాజీవ్‌ ఉసెఫ్, టాన్‌ బూన్‌ హెంగ్, టాన్‌ వీ కోంగ్, చౌ హో వా, సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, సాత్విక్‌ సాయిరాజ్, శ్రీకృష్ణప్రియ, జె.మేఘన.

ముంబై రాకెట్స్‌: సుంగ్‌ జీ హున్, లీ యోంగ్‌ డే, నిపిత్‌ఫాన్, నదీనా జీబా, అజయ్‌ జయరామ్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, శ్రేయాన్‌‡్ష జైస్వాల్, చిరాగ్‌ శెట్టి, మోహితా సహదేవ్, వృశాలి.

ఢిల్లీ ఏసర్స్‌: జాన్‌ జొర్గెన్సన్, సన్‌ వాన్‌ హో, జిందపాన్, ఇవాన్‌ సొజొనోవ్, వ్లదీమర్‌ ఇవనోవ్, గుత్తా జ్వాల, కె. మనీషా, అక్షయ్‌ దివాల్కర్, ఆకర్షి కశ్యప్, సిరిల్‌ వర్మ.

అవధ్‌ వారియర్స్‌: సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, మార్కిస్‌ కిడో, గో షెమ్, బోడిన్‌  ఇసారా, విన్సెంట్‌ వాంగ్‌ వింగ్‌ కి, ఆదిత్య జోషి, రితూపర్ణ దాస్, ప్రజక్తా సావంత్, సావిత్రీ అమిత్రపాయ్‌.

బెంగళూరు బ్లాస్టర్స్‌: బూన్సాక్‌ పొన్సానా, విక్టర్‌ అక్సెల్‌సన్, కో సుంగ్‌ హ్యూన్, యూ యోన్‌ సోంగ్, చెంగ్‌ గాన్‌ యి, సౌరభ్‌ వర్మ, రుత్విక శివాని, ప్రణవ్‌ చోప్రా, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి.

చెన్నై స్మాషర్స్‌: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, తనోంగ్‌సక్‌ సాన్‌సోమ్‌బూన్‌సక్, టామీ సుగియార్తో, క్రిస్‌ అడ్‌కాక్, మ్యాడ్స్‌ కోల్డింగ్, గాబ్రియెల్‌ అడ్‌కాక్, రమ్య తులసి, అరుంధతి పంతవానే, సుమీత్‌ రెడ్డి.

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు  టికెట్‌ ధరను    రూ. 500గా నిర్ణయించారు. బుక్‌ మై షో ద్వారా టికెట్లు    కొనుగోలు చేయవచ్చు.

పీబీఎల్‌ తొలి సీజన్‌ అభిమానులను ఆకట్టుకోగా రెండో సీజన్‌కు అన్ని వైపుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పదేళ్ల కాలానికి టోర్నీ నిర్వహణ కోసం మేం ‘బాయ్‌’తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా లాభాలు ఆశించడం లేదు. బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగినట్లే ఈ లీగ్‌ను కూడా పెద్ద స్థాయికి చేర్చాలనేదే మా లక్ష్యం. సచిన్‌లాంటి వ్యక్తి లీగ్‌తో జత కలవడం మా నమ్మకాన్ని పెంచింది. ఈ సీజన్‌లో అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశాం.  –స్పోర్ట్స్‌ లైవ్‌ ప్రతినిధి ఎం. ప్రసాద్‌

భారత్‌కు రావడం చాలా బాగుంది. హంటర్స్‌ అభిమానులు నాకు మద్దతు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా. సింధు కఠిన ప్రత్యర్థి. ఆమె సొంత నగరంలో ఆమెతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. –కరోలినా మారిన్‌

లీగ్‌లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయి. 11 పాయింట్ల ఫార్మాట్‌తో సమస్య లేదు. ప్రతీ పాయింట్‌ కీలకమే.  – పీవీ సింధు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement