సింధు ‘సిక్సర్’
సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కైవసం
‘మిక్స్‌డ్’ చాంప్ సిక్కి రెడ్డి జోడి
లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆమె కెరీర్‌లో ఇది ఆరో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కాగా... సయ్యద్ మోడి టోర్నీలో మొదటిది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో రెండు సార్లు (2012, 2014) రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21–13, 21–14తో గ్రెగోరియా మరిస్క (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. సింధు జోరు ముందు ఆమె ప్రత్యర్థి 30 నిమిషాల్లోనే తేలిపోయింది. గతంలో సింధు మకావు ఓపెన్‌ను మూడుసార్లు, మలేసియా మాస్టర్స్ టోర్నీని రెండుసార్లు గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రన్నరప్‌తో తృప్తిపడ్డాడు. తుదిపోరులో తొమ్మిదో సీడ్ సాయి 19–21, 16–21తో భారత్‌కే చెందిన ఎనిమిదో సీడ్
సమీర్ వర్మ చేతిలో ఓడాడు.
‘మిక్స్‌డ్’లో విజేతగా నిలిచిన సిక్కిరెడ్డి... మహిళల డబుల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడి 22–20, 21–10తో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటపై గెలిచింది. డబుల్స్‌లో అశ్వినితో జతకట్టిన ఆమె 16–21, 18–21తో కమిల్ల రైటెర్–క్రిస్టియానా పెడెర్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది.