పీవీ సింధు
బ్యాడ్మింటన్ సంచలనం సింధు స్పష్టమైన లక్ష్యాలతో ముందడుగు వేస్తోంది. త్రుటిలో చేజారిన ఫలితాలను రాబట్టేందుకు సిద్ధమైంది. ‘రియో’లో చేజారిన స్వర్ణం, గతేడాది ఫైనల్ ఓటములతో టాప్ ర్యాంక్‌ను అందుకోలేకపోయిన ఈ హైదరాబాదీ... మెగా ఈవెంట్లున్న ఈ ఏడాదిని విజయవంతంగా మలుచుకోవాలని పట్టుదలతో ఉంది.
ముంబై: ప్రతిష్టాత్మక ఈవెంట్లున్న 2018లో భారీ విజయాలపై దృష్టి పెట్టింది బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు. ముఖ్యంగా ఈ సీజన్‌లోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధిస్తానని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం తెస్తానని చెప్పుకొచ్చింది. ఏడాదిలో తప్పనిసరిగా 15 టోర్నమెంట్‌లు ఆడాల్సిందేనన్న నిబంధన అమలవుతున్న నేపథ్యంలో శారీరక సామర్థ్యానికి ఈ సీజన్ పెద్ద పరీక్షలాంటిదని చెప్పింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఈ తెలుగు తేజం పలు అంశాలపై మీడియాతో ముచ్చటించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
ఆల్ ఇంగ్లండ్ నుంచి...
గతేడాది కీలకమైన టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం వల్ల టాప్ ర్యాంక్‌కూ చేరువయ్యా. కానీ తుదిపోరులో ఓడిపోవడం వల్ల అగ్రస్థానం అందకుండా పోయింది. ఈ ఏడాది మాత్రం తప్పకుండా నంబర్‌వన్ ర్యాంకు సాధిస్తా. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచే నా ప్రదర్శనకు ‘నంబర్‌వన్’ పట్టుదల కూడా జోడిస్తా. ఏడాది చివరికల్లా టాప్ ర్యాంకులో నిలుస్తా.
ప్రతీ టోర్నీ భిన్నమైంది...
ప్రతీ టోర్నీ ఒకలాగే సాగదు. నా వరకైతే ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు కఠినమైంది. చాలా సుదీర్ఘంగా సాగింది ఆ మ్యాచ్. ఇలాంటి పోటీల్లో కడదాకా పోరాడాలంటే కేవలం ఫిట్‌నెస్ ఉంటే సరిపోదు. మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. బీడబ్ల్యూఎఫ్ ఈ ఏడాది నుంచి ప్రతీ ప్లేయర్ 15 టోర్నీలు ఆడాలన్న నిబంధన అమలు చేస్తున్న దృష్ట్యా ఆటగాళ్లకు మెంటల్ ఫిట్‌నెస్ చాలా అవసరం.
పతకం వన్నె మారుస్తా...
రియో ఒలింపిక్స్‌లో పోరాడాను. క్వార్టర్ ఫైనల్లో తీవ్రంగా చెమటోడ్చాను. మొత్తానికి పతకం వేటలో నిలిచాను. తుదిపోరులో ఒకదశలో ఆధిక్యంలో నిలిచి పసిడి పతకానికి చేరువైనా... త్రుటిలో చేజార్చుకున్నాను. చిన్నపొరపాట్లతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ (2020)లో మాత్రం అలా కానివ్వను. తప్పకుండా బంగారు పతకం గెలుస్తాను. ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాను.
21 పాయింట్లే ముద్దు...
ప్రస్తుతమున్న గేమ్ పాయింట్ల పద్ధతిని మార్చాల్సిన పనిలేదు. 21 పాయింట్లతో ‘బెస్టాఫ్ త్రీ గేమ్స్’ విధానమే బాగుంది. దీనికి బదులు 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్ గేమ్స్’ పద్ధతి తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో మ్యాచ్‌లో పుంజుకునేందుకు చాలా కష్టమవుతుంది. ఐదారు పాయింట్లు వెనుకబడినా... ఇంకా 15 పాయింట్ల దాకా ఉండే ఆటలో ముందంజ వేసే అవకాశముంటుంది. అదే 11 పాయింట్ల పద్ధతిలో ఈ అవకాశం చాలా తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment