
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్త జట్టు దర్శనమివ్వనుంది. గత సీజన్‌లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్న ఈ లీగ్‌లో ఈసారి పుణే సెవెన్ ఏసెస్ కొత్తగా చేరింది. దీంతో మొత్తం జట్ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ జట్టుకు ప్రముఖ కథానాయిక తాప్సి పన్ను సహ యజమాని కావడం విశేషం. మూడేళ్ల క్రితం కేవలం ఆరు జట్లతో ప్రారంభమైన పీబీఎల్ సీజన్–1 అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ‘దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు పీబీఎల్ చక్కగా ఉపయోగపడుతోంది.
దీని వల్ల ఆటపై మక్కువ ఇంకా పెరుగుతోంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిస్వ శర్మ తెలిపారు. నాలుగో సీజన్ ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి జనవరి 13 వరకు దేశంలోని ఐదు నగరాల్లో జరుగనుంది. ‘చిన్నతనం నుంచి నాకు బ్యాడ్మింటన్ ఆటతో సంబంధం ఉంది. ఎప్పటి నుంచో ఆటతో మమేకం అవడానికి ఎదురుచూస్తున్నా. అలాంటి సమయంలో పీబీఎల్ నాకు సరైన వేదిక అనిపించింది. ఈ సీజన్‌లో పుణే సెవెన్ ఏసెస్ దూసుకెళ్తుందనే నమ్మకం ఉంది’ అని పుణే సెవెన్ ఏసెస్ సహ యజమాని తాప్సి తెలిపింది.