
పుణే అటవీ శాఖలో సరికొత్త పర్యాటక ప్రయోగం
గ్రాస్ ల్యాండ్ సఫారీతో పర్యాటకులకు కొత్త అనుభూతి
తాజాగా షోలాపూర్‌లోని బోరామణిలో మరో సఫారీ అందుబాటులోకి
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ సైతం ఇప్పుడిప్పుడే చొరవ కనబరుస్తోంది. గడ్డిభూములున్న ప్రాంతాలను గుర్తించి పర్యావరణ, పర్యాటకాన్ని ద్విగుణీ కృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడి విశేషాలేంటి?
మహారాష్ట్ర మొదటగా..
పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పుణే(మహారాష్ట్ర) లోని అటవీ శాఖ షోలాపూర్‌లో గ్రాస్ ల్యాండ్ సఫారీ (గడ్డి భూముల్లో విహారయాత్ర)కి శ్రీకారం చుట్టింది. ఇక్కడి బోరామణి గ్రామ గడ్డి భూముల్లో తాజాగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ భూములు కృష్ణ జింకలు, తోడేళ్ళు, బెంగాల్ నక్కలు, అడవి పందులు, రంగురంగుల సీతాకోకచిలుక జాతులకు ఆవాసాలు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఉనికి ఇక్కడ కనిపిస్తుంది. వాటి సహజ ఆవాసాలను వాహనాల్లో సంచరిస్తూ వీక్షించే
అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది.
రోజుకు రెండు సార్లు మాత్రమే..
ఈ గ్రాస్‌ల్యాండ్ సఫారీ రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల మధ్యలో విహరించేందుకు అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులు, పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా పరిమిత సంఖ్యలో వాహనాల్లో సంచరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని పంచడానికి అటవీ శాఖ రాత్రి పూట బసలను అందుబాటులో ఉంచింది. ఈ గడ్డిభూముల్లో సందర్శకులు సొంత వాహనాల్లో, అద్దెవాహనాల్లో విహరిస్తూ ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.
కర్బన శోషకాలు.. గడ్డిభూములు
కర్బన ఉద్గారాలతో పాటు ఉదజని (కార్బన్ డయాక్సైడ్)ని శోషించి వాతావరణాన్ని నియంత్రించడంలో గడ్డిభూములది కీలక పాత్ర. కృష్ణ జింకలు, జింకల్లాంటి శాకాహారులు, తోడేళ్లు, నక్కల్లాంటి మాంసాహారులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తాయి. గడ్డిభూముల సంరక్షణ విషయానికి వస్తే..అడవులతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పొచ్చు. పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, పరిశోధకులకు స్వేచ్ఛగా గడ్డిభూముల్లో విహరించే వీలు కల్పించడం ద్వారా వీటి సంరక్షణపై అవగాహన తీసుకురావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
2024 జనవరిలో ప్రారంభం
గడ్డిభూముల్లో సఫారీకి 2024 జనవరిలో పుణే, షోలాపూర్ ప్రాంతాల్లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ అటవీ రేంజ్ లోని గడిఖేల్, శిర్షుపాల్, సబ్లెవాడీ, పర్వాడీ పరిధిలో విశాలమైన పచ్చిక బయళ్లలో సఫారీ ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో గడ్డిభూములున్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో స్థానికులకు ప్రత్యక్ష,ంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. శిక్షణ పొందిన స్థానిక గైడ్లకు రూ. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.