ఫైనల్ డ్రాఫ్ట్‌కు ఆమోదం... సీఎం పరిశీలన తర్వాతే అమలులోకి..
వారసత్వ, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎకో విలేజ్‌ల ఏర్పాటు
జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే ప్రకృతి, సహజ సంపదకు హాని కలగకుండా చర్యలు
ప్రజలు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాలకూ ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యంతో అలరారుతున్న తెలంగాణను ‘ఎకో టూరిజం సెంటర్’గా మలిచేలా కార్యాచరణ ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పర్యావరణ హితంగా, ప్రకృతి, సహజ సంపదకు హాని కలగకుండా చూస్తూనే, ప్రజలు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పలు గ్రామాలను ‘ఎకో విలేజ్ లుగా’తీర్చిదిద్దడంతోపాటు వారసత్వ, సాంస్కృతిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఎక్కడికక్కడ ఆయా ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వంటకాలు, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను భాగం చేస్తూ ప్రకృతి పర్యాటకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎకో టూరిజం స్పాట్లను గుర్తించి, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకతలను అర్థవంతంగా చెప్పడంతోపాటు ఆన్‌లైన్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా వెబ్‌సైట్లు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మొత్తంగా తెలంగాణ ఎకో టూరిజానికి ఓ బ్రాండ్‌గా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, ఇతర ప్రదేశాల్లోనూ ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఎకో టూరిజం ప్రదేశాలను స్టడీ టూర్ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతోపాటు ఉద్యాన వనాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిపై ఆధారపడి జీవించే వారికి వీటిని ఉపాధి కేంద్రాలుగా మలిచే దిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
ఇందుకు అనుగుణంగా ఎకో టూరిజం ప్రాజెక్టులపై అటవీశాఖాపరంగా ముసాయిదా విధానం సిద్ధం కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలన తర్వాత ప్రభుత్వపరంగా ఈ ప్రణాళికకు తుదిరూపు ఇస్తారు. ఈ మేరకు ఇటీవల ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ హోదాలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఫైనల్ డ్రాఫ్ట్‌నకు ఆమోదం తెలిపారు. తుది అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషనే నోడల్ ఏజెన్సీ
ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేస్తారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఇతర నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్), ఇతర నిధులను సమీకరించాలని అటవీశాఖ భావిస్తోంది.
మొత్తంగా ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో ప్రభుత్వపరంగా అటవీశాఖ ద్వారానే నిర్వహించకుండా, ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీలకు ఇస్తే మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అటవీశాఖ పరంగా ఆయా అంశాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రకృతి సమతుల్యతకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టడమనేది కొంత కత్తిమీద సాము లాంటిదేనని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఎకో టూరిజం పేరుతో అటవీ ప్రాంతాల్లోని జీవజాలం, వైవిధ్యానికి ఇబ్బందికరంగా మారకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment