Indian Badminton Association
-
సాయిప్రణీత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు. 2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి (కేరళ) అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా... సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్... ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు. -
సైనా X ‘బాయ్’
హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది. కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం. ఏం జరిగిందంటే... ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది. వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’. –సైనా నెహ్వాల్ -
తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే...
న్యూఢిల్లీ: కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం పూర్తి స్థాయి శిక్షణను మొదలు పెట్టాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) భావిస్తోంది. ఇందు కోసం హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయించింది. అన్నీ అనుకూలిస్తే ట్రైనింగ్ క్యాంప్‌ను జులై 1 నుంచి నిర్వహించాలనేది ప్రతిపాదన. అయితే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో లాక్డౌన్ విషయంలో సడలింపులు ఇచ్చినా... క్రీడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో శిబిరం నిర్వహించడం సాధ్యమా అనేది సందేహమే. కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాదాపు నెల రోజులుగా బెంగళూరులో పలువురు షట్లర్లు తమ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. నగరానికి చెందిన టాప్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ తదితరులు మాత్రం శిక్షణకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ‘కోవిడ్–19 కారణంగా శిక్షణ నిలిచిపోయింది. మేం ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. జులై 1 నుంచి హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహించాలనేది మా ఆలోచన. అయితే ప్రభుత్వ అనుమతి రావడమే అన్నింటికంటే ముఖ్యం. దేశవాళీ టోర్నీలు నిర్వహించే విషయంలో రాష్ట్ర సంఘాలతో చర్చించాం. అందరి సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబరు వరకు ఎలాంటి టోర్నీలు జరపరాదని నిర్ణయించాం’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. బీడబ్ల్యూఎఫ్ షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఈ ఏడాది నాలుగు బ్యాడ్మింటన్ టోర్నీలు జరగాల్సి ఉండగా, హైదరాబాద్ ఓపెన్ సూపర్–100, జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి. -
జాతీయ చాంపియన్‌షిప్ వాయిదా
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ స్థితిలోకి వెళ్లిన నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం లక్నో వేదికగా ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ‘బాయ్’ కార్యదర్శి అజయ్ సింఘానియా వెల్లడించారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించింది. ఈ నేపథ్యంలో జాతీయ సీనియర్స్ టోర్నీతో పాటు ఇంటర్ జోనల్ చాంపియన్‌షిప్‌నూ వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ కఠిన పరిస్థితుల్లో కరోనాను సమర్థంగా నియంత్రించడమే అన్నింటికన్నా ప్రధానమైన అంశం. పరిస్థితులు అదుపులోకి వచ్చాక టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై చర్చిస్తాం’ అని ఆయన వివరించారు. లక్నో ఏర్పాట్లను విరమించుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల క్రీడా సంఘాల కార్యదర్శులకు సూచించామన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వాయిదా వేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘యావత్ బ్యాడ్మింటన్ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యమే అందరికీ ప్రధానం’ అని ఆయన అన్నారు. -
భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. బాలురు, బాలికల విభాగాల్లో కలిపి మొత్తం 23 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ముగ్గురు తెలంగాణ షట్లర్లకు చోటు దక్కింది. బాలుర విభాగంలో ప్రణవ్ రావు గంధం, నవనీత్ బొక్కా, ఖదీర్ మొయినుద్దీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు. బాలికల విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ ఎంపిక కాలేదు. ఆగస్టులో పంచకుల, బెంగళూరులలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రదర్శన, సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు రష్యాలోని కజాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. -
పీబీఎల్‌లో మరో కొత్త జట్టు
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్త జట్టు దర్శనమివ్వనుంది. గత సీజన్లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్న ఈ లీగ్‌లో ఈసారి పుణే సెవెన్ ఏసెస్ కొత్తగా చేరింది. దీంతో మొత్తం జట్ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ జట్టుకు ప్రముఖ కథానాయిక తాప్సి పన్ను సహ యజమాని కావడం విశేషం. మూడేళ్ల క్రితం కేవలం ఆరు జట్లతో ప్రారంభమైన పీబీఎల్ సీజన్–1 అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ‘దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు పీబీఎల్ చక్కగా ఉపయోగపడుతోంది. దీని వల్ల ఆటపై మక్కువ ఇంకా పెరుగుతోంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిస్వ శర్మ తెలిపారు. నాలుగో సీజన్ ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి జనవరి 13 వరకు దేశంలోని ఐదు నగరాల్లో జరుగనుంది. ‘చిన్నతనం నుంచి నాకు బ్యాడ్మింటన్ ఆటతో సంబంధం ఉంది. ఎప్పటి నుంచో ఆటతో మమేకం అవడానికి ఎదురుచూస్తున్నా. అలాంటి సమయంలో పీబీఎల్ నాకు సరైన వేదిక అనిపించింది. ఈ సీజన్లో పుణే సెవెన్ ఏసెస్ దూసుకెళ్తుందనే నమ్మకం ఉంది’ అని పుణే సెవెన్ ఏసెస్ సహ యజమాని తాప్సి తెలిపింది. -
‘అర్జున’కు సిక్కి రెడ్డి పేరు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ‘అర్జున అవార్డు’కు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిక్కి రెడ్డి పేరును ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ నామినేట్ చేశారు. ఇటీవలే గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించింది. -
షట్లర్లకు ‘బాయ్’ రూ.1.6 కోట్ల నజరానా
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్లలో అద్భుతంగా రాణిస్తున్న ప్రముఖ షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) భారీ నజరానాలను అందించింది. ఇందులో గతేడాది ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ గెలవడంతో పాటు తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు రూ.25 లక్షల చెక్‌ను ‘బాయ్’ నూతన అధ్యక్షుడు హిమంత బిస్వా శర్మ అందించారు. 2015లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా కూడా సైనా రికార్డులకెక్కింది. ఇక మలేసియా మాస్టర్స్ (2016), మకావు ఓపెన్ (2015), కామన్వెల్త్ గేమ్స్ (2014)లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు రూ.20 లక్షలు ఇచ్చారు. అయితే 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు 2015 సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి టైటిల్ సాధించిన కశ్యప్... తనకు రావాల్సిన ప్రైజ్‌మనీ అందలేదని శర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అతడికి కూడా రూ.30 లక్షల చెక్‌ను అందించారు. ఇదే తరహాలో గురుసాయిదత్‌కు రూ.5 లక్షలు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు రూ.10 లక్షలు అందించడం జరిగింది. ఇప్పటి నుంచి ఆటగాళ్లకు వెంటవెంటనే ప్రైజ్‌మనీని అందిస్తామని శర్మ స్పష్టం చేశారు. -
ఐబీఎల్-2 వాయిదా!
జనవరికి మార్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రారంభమైన తొలి ఏడాదే సూపర్ సక్సెస్ సాధించినా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆరంభ టోర్నీ నిర్వహించిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఐబీఎల్-2ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని భావించింది. కానీ, పలు అంతర్జాతీయ టోర్నీల కారణంగా దీన్ని వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జూలైలో కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో టోర్నీకి గ్లామర్ తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు బాయ్ ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు.