హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది.
కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం.
ఏం జరిగిందంటే...
ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది.
వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి.
‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్‌లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’.
–సైనా నెహ్వాల్
Comments
Please login to add a commentAdd a comment