SELECTION TRIALS
-
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
హెచ్‌సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్‌గా మారిన హెచ్‌సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్‌లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్‌లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్‌సీఏ వెనక్కి పంపించింది. ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్‌సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్‌డౌన్ ప్లేయర్‌గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. కాగా హెచ్‌సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక.. -
సెలెక్షన్ ట్రయల్స్‌కు సైనా దూరం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సెలెక్షన్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్’కు సమాచారం ఇచ్చారు. సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్‌కు అష్మిత చాలియాను ‘బాయ్’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్ మ్యాచ్‌లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్ ప్లేయర్‌గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్‌ల కోసం నేడు ట్రయల్స్‌ను ఏర్పాటు చేశారు. -
టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఒక క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. షోయబ్ అనే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సింద్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంటర్ సిటీ చాంపియన్‌షిప్‌ను ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులను కోరింది. కాగా బోర్డులు కోచ్‌ల సలహా మేరకే ట్రయల్స్‌ను నిర్వహించి ఆపై జట్టును ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్‌ను కోచ్ కనీసం బౌలింగ్ ట్రయల్ కూడా తీసుకెళ్లలేదు. దీంతో హైదరాబాద్ జట్టులో షోయబ్ పేరు గల్లంతయింది. ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపం చెందిన షోయబ్ ఇంటికి వచ్చి బెడ్రూంకు వెళ్లి తలుపులేసుకున్నాడు. షోయబ్ కోపంగా రావడం చూసిన ఇంటి సభ్యులు బెడ్రూంకు వెళ్లి చూసే లోపలే షోయబ్ తన చేతిని బ్లేడ్‌తో పలుమార్లు కట్ చేసుకొని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అతని కుటుంబసభ్యులు స్పందించారు. ''కోచ్ తనను బౌలింగ్ ట్రయల్స్ తీసుకెళ్లలేదని.. దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మేం వెళ్లి చూసేలోపే చేతి కట్ చేసుకొని బాత్రూంలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం షోయబ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నట్లు'' తెలిపారు. అయితే పాకిస్తాన్ క్రికెట్లో ఇది కొత్తేం కాదు. ఇంతకముందు 2018లో అండర్-19 క్రికెటర్ ముహమ్మద్ జర్యాబ్ తనను జట్టులో నుంచి తీసేశారని ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చదవండి: కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్ 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
కామన్వెల్త్కు హుసాముద్దీన్
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్‌పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్). -
జ్యోతి సురేఖ పునరాగమనం
తొలి రెండు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టులో చోటు సంపాదించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ సెలెక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటుకొని మళ్లీ భారత జట్టులోకి వచ్చింది. సోనెపట్‌లో భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన జ్యోతి సురేఖ రాణించి జూన్ 21 నుంచి 26 వరకు పారిస్‌లో జరిగే ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీకి, జూలై 7 నుంచి 17 వరకు అమెరికాలో జరిగే వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానం దక్కించుకుంది. -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్‌కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్‌లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్‌లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్‌గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
సైనా X ‘బాయ్’
హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది. కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం. ఏం జరిగిందంటే... ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది. వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’. –సైనా నెహ్వాల్ -
'నాకు న్యాయం కావాలి'
రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్తో మరో యువ బాక్సర్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలతో స్టార్ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ సమయంలో మేరీ కోమ్ పక్షాన నిలిచిన ఫెడరేషన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్ జట్టులో మణిపూర్ సీనియర్ బాక్సర్ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో యువ బాక్సర్ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్ దిగ్గజమైన మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం. నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్ ట్రయల్స్ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ అవకాశమని బీఎఫ్ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్ బెర్తు కట్టబెట్టింది. నిఖత్ డిమాండ్ సబబే: బింద్రా భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా బాక్సర్ నిఖత్ జరీన్ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్ కెరీర్లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు. -
28 నుంచి చెస్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టు కోసం ఈనెల 28 నుంచి సెలక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. వరంగల్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో కాజీపేట్‌లోని బిషప్ బెరెట్టా పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తారు. అండర్–7, 9, 11 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీలో ప్రతి కేటగిరీలోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన బాలబాలికలు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 27లోగా తమ ఎంట్రీలను పంపించాలి. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు 90665 67567, 98494 94999, 94920 27919ను సంప్రదించాలి. 29 నుంచి రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి రాష్ట్రస్థాయి జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఎల్బీ స్టేడియంలోని టీఎస్‌సీఏ కార్యాలయంలో అండర్–19 బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్విస్ లీగ్ ఫార్మాట్లో పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 28లోగా ఎంట్రీలను పంపించాలి. స్పాట్ ఎంట్రీలకు అనుమతి లేదు. వివరాలకు www.chesstelangana.com వెబ్సైట్లో లేదా 73375 78899, 73373 99299 నంబర్లలో సంప్రదించాలి. -
నేడు క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ (సీఎఫ్‌హెచ్) ఆధ్వర్యంలో గురువారం అండర్-17 రాష్ట్ర జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందిరాపార్క్ ఎదురుగా వున్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ జరుగుతాయని సీఎఫ్‌హెచ్ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఏపీ జట్టుకు ఎంపిక చేస్తారు. ఈ జట్టు ఆలిండియా చౌదరి రణ్‌బీర్ సింగ్ హుడా జాతీయ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు చండీగఢ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్, శ్రీలంక, దుబాయ్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన జట్లు పాల్గొననున్నాయి. 17 ఏళ్ల లోపు వయసున్న క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు కోచ్ రజనీకాంత్‌ను 9966667798, 9966667795 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చు. -
నేడు బాస్కెట్‌బాల్ సెలక్షన్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్: కేరళలోని ఎర్నాకులంలో జరగనున్న జాతీయ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ కోసం శనివారం సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి. అండర్-18 బాల బాలికలకు ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. జాతీయ చాంపియన్‌షిప్ కోసం రాష్ట్ర జట్టుకు ప్రాబబుల్స్‌ను సెలక్షన్ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 11 నుంచి 23 వరకు వైఎంసీఏలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. శిక్షణ అనంతరం అండర్-18 జాతీయ చాంపియన్‌షిప్‌కు జట్టును ఎంపిక చేస్తారు. ఈ టోర్నీని భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య, కేరళ బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్తంగా ఈ నెల 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నాయి. -
భారత బాక్సర్లకు అనుమతి
పాటియాల : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ ఒక్క టోర్నీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) అనుమతించింది. అయితే దీని తర్వాత జరగబోయే టోర్నీల్లో పాల్గొనాలంటే మాత్రం కచ్చితంగా నవంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)ను ఆదేశించింది. రెండు రోజుల సెలక్షన్ ట్రయల్స్ అనంతరం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 10 మంది సభ్యులుగల భారత జట్టును ఎంపిక చేశారు. ప్రపంచ చాంపియన్‌షిప్ అక్టోబరు 11 నుంచి 27 వరకు కజకిస్థాన్‌లో జరుగుతుంది. భారత జట్టు: నానో సింగ్ (49 కేజీలు), మదన్ లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (81 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు).